పెదకళ్ళేపల్లి

పెదకళ్ళేపల్లి
కృష్ణా జిల్లాలో కొలువుదీరిన విశిష్టమైన పుణ్య క్షేత్రాలలో 'పెదకళ్ళే పల్లి' పుణ్య క్షేత్రం ఒకటి. ఈ శైవక్షేత్రం మచిలీపట్నానికి 35 కిలోమీటర్ల దూరంలో వెలసింది. మహారణ్యాలలో 18 వ అరణ్యమైన 'కదళిక అరణ్యం' ... కదళీపుర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశంలోనే జనమేజయుడు 'సర్పయాగం' చేసినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. కశ్యప ప్రజాపతి తన పుత్రుల శాప విముక్తికై, కదళీవనంలో తపస్సు ఆచరిస్తుండగా శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వరుడు లింగరూపంలో ఆవిర్భవించాడు. కాలక్రమంలో కదళీ పురం ... కళ్ళే పల్లిగా ... పెదకళ్ళే పల్లిగా మారిపోయింది.

దక్షిణ కాశీగా పిలవబడే పెదకళ్ళేపల్లి క్షేత్ర మహాత్మ్యం గురించి 'స్కాంద పురాణం'లోను ... 'పద్మ పురాణం'లోను పేర్కొనడం జరిగింది. కర్కోటకము అనే సర్ప రూపంలో స్పటిక లింగంగా ఆవిర్భవించిన శివుడిని వశిష్ఠ మహర్షి దర్శించుకున్నట్టు ఆధారాలు వున్నాయి. ఈ క్షేత్రానికి 'రుక్మిణీ సమేత శ్రీ వేణుగోపాల స్వామి' క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తున్నాడు. కాకతీయ రాజగురువు సోమశివాచార్యులు క్రీ. శ.1292లో తొలిసారిగా స్వామివారికి ఆలయాన్ని నిర్మించినట్టు శాసనాల ద్వారా తెలుస్తోంది.

ఇక్కడి రాజగోపుర నిర్మాణం కళ్ళను కట్టి పడేస్తుంది. ఇక్కడ చాలా కుండాలు ఉన్నప్పటికీ వాటిలో 'నాగకుండం' ఎంతో విశిష్ట మైనదిగా చెప్పబడుతోంది. అనేక పుణ్య తీర్థాలు కలవడం వలన ఈ కుండాన్ని 'పరికర్ణికా తీర్థం'అని పిలుస్తుంటారు. రమణీయమైన ప్రకృతి సోయగాల నడుమ వెలసిన ఈ క్షేత్రం భక్త జనకోటిని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆలయ ప్రాంగణంలో 'సత్య స్తంభం' కనిపిస్తుంది. వివాదాస్పద విషయాలకి సంబంధించి ఇక్కడ సత్య ప్రమాణాలు చేస్తుంటారు. ప్రాచీన కాలం నుంచి తన నిష్టను చూపుతోన్న ఈ సత్య స్తంభాన్ని తాకిన తరువాతనే భక్తులు నాగేశ్వరుడిని దర్శిస్తూ వుంటారు.

ఇక్కడ వినాయకుడు పంచముఖాలతో సింహాన్ని అధిష్టించి కనిపించడం విశేషంగా అనిపిస్తుంది. ఇక నవగ్రహాలతో పాటు ... పార్వతీ ... దుర్గ... కాలభైరవుడు ... భద్రకాళీ ... వీరభద్ర స్వామి ... సుబ్రహ్మణ్య స్వామి కొలువుదీరి కనిపిస్తారు. అత్యంత పవిత్రమైన ఈ క్షేత్రంలో శ్రావణ ... కార్తీక ... మాఘ మాసాల్లో విశేష పూజలు ... ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి.

More Bhakti Articles