శాంతించిన ఉగ్ర నృసింహుడు

శాంతించిన ఉగ్ర నృసింహుడు
ప్రసిద్ధి చెందినటువంటి కొన్ని లక్ష్మీనృసింహస్వామి ఆలయాలను దర్శించినప్పుడు, హిరణ్య కశిపుడిని సంహరించిన అనంతరం స్వామివారు ఆ ప్రదేశాల్లో ఆవిర్భవించినట్టు తెలుస్తూ వుంటుంది. మొదట ఉగ్రమూర్తిగా ఆ ప్రదేశాలకి చేరుకున్న స్వామి, ఆ తరువాత శాంతించి లక్ష్మీ సమేతుడై భక్తులను అనుగ్రహిస్తునట్టు స్థలపురాణం చెబుతూ వుంటుంది.

ఇలాంటి నేపథ్యమే మనకి 'జాన్కంపేట' లక్ష్మీనృసింహస్వామి ఆలయం విషయంలోనూ వినిపిస్తుంది. నిజామాబాద్ జిల్లా పరిధిలో గల ఈ క్షేత్రం మహా పవిత్రమైనదిగా ... అత్యంత శక్తిమంతమైనదిగా అలరారుతోంది. హిరణ్య కశిపుడిని సంహరించిన అనంతరం, స్వామివారు ఆ ఉగ్రత్వంతోనే ఇక్కడి కొండపైకి చేరుకుని శిలారూపంలో ఆవిర్భవించాడట.

ఇక్కడ తపస్సు చేసుకుంటోన్న మహర్షులు ... మునులంతా కూడా స్వామివారిని దర్శించడానికీ, ఆయనని అర్చించడానికి ప్రయత్నించారు. అయితే అక్కడ తీవ్రమైన వేడి ఉండటంతో, స్వామి ఆగ్రహంతో ఉన్నాడని భావించి, ఆయనని శాంతింపజేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఎలాంటి ప్రయోజనం లేకపోగా, స్వామి వారి ఉగ్రత్వం కారణంగా అక్కడ ఉష్ణోగ్రత మరింత పెరిగిపోసాగింది ... ప్రకృతిలోని పచ్చదనం నశించసాగింది.

దాంతో ఉగ్రత్వం తగ్గడానికి తామేం చేయాలో చెప్పవలసిందిగా మహర్షులు కోరడంతో, స్వామివారే అందుకు తగిన సూచన చేశారట. మహర్షులు ఆ ప్రకారం చేయగానే స్వామివారి ఉగ్రత్వం తగ్గిపోయి ప్రశాంతమూర్తిగా మారిపోయాడు. అప్పటి నుంచి ఇక్కడి స్వామివారిని భక్తులు దర్శిస్తూ ... పూజిస్తూ వస్తున్నారు. స్వామివారు స్వయంగా వచ్చి ఇక్కడ ఆవిర్భవించిన కారణంగా ఇది మహిమాన్వితమైన క్షేత్రంగా భక్తులు విశ్వసిస్తుంటారు. నిరంతరం ఆ స్వామిని స్మరిస్తూ తరిస్తుంటారు.

More Bhakti Articles