సద్గురువే సాక్షాత్తు భగవంతుడు

సద్గురువే సాక్షాత్తు భగవంతుడు
అజ్ఞానమే లోకంలో గల హింసకి కారణమవుతూ వుందని భావించిన భగవంతుడు, జ్ఞానమనే మార్గంలో మానవాళిని నడిపించవలసిన అవసరాన్ని గుర్తించాడు. అందుకోసం తన అంశతో గురుపరంపరను కొనసాగించాడు. ఆ పరంపరలో తన ప్రత్యేకతను చాటుకున్న సద్గురువుగా శ్రీ శిరిడీ సాయిబాబా దర్శనమిస్తూ వుంటాడు.

భగవంతుడే గురువుగా అవతరించి మనుషుల మధ్యనే ఉంటూ, కోరిన వారికి కోరిన విధంగా భుక్తినీ ... శక్తినీ ... ముక్తిని ప్రసాధించిన తీరు మనకి శిరిడీ సాయినాథుడి విషయంలో ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు బాబా సాక్షాత్తు భగవంతుడేననే విషయాన్ని చెప్పకనే చెబుతుంటాయి. ఒకసారి మహాల్సాపతిని పిలిచి, తాను దేహాన్ని వదిలి వెళుతూ ఉన్నాననీ, మూడవ రోజుకి తిరిగిరాకపోతే ఆ దేహాన్ని సమాధి చేయవలసిందిగా బాబా చెబుతాడు.

మహాల్సాపతి ఒడిలో తలపెట్టుకుని ఆయన అచేతనంగా మారిపోవడంతో, తామంతా అనాథలమైనట్టుగా ఆయన భక్తులు దుఃఖిస్తుంటారు. బాబా విషయంలో మొదటి నుంచి అసూయతో వ్యవహరిస్తూ వస్తోన్న భాటే, ఆయన శవాన్ని వెంటనే అక్కడి నుంచి తీసేయాలంటూ పట్టుపడతాడు. భక్తులందరూ కూడా ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తారు.

బాబా శరీరాన్ని పరీక్షించిన ఆంగ్లేయ వైద్యులు, రెండు రోజులు గడిచినా ఆయన శరీరం బిగుసుకుపోకపోవడం చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు. బాబా చెప్పినట్టుగా మూడవరోజు తిరిగి రాకపోతే వెంటనే ఆయన దేహాన్ని సమాధి చేయమనీ, ప్లేగు వ్యాధి విస్తరిస్తోన్న సమయంలో శవాన్ని ఎక్కువ రోజులు ఉంచకూడదని వాళ్లు హెచ్చరిస్తారు. దాంతో బాబా భక్తులు మరింత మానసిక వత్తిడికి లోనవుతారు. ఆయన తిరిగి రావాలని కోరుకుంటూ అదే పనిగా భజనలు చేయడం మొదలుపెడతారు.

మూడవ రోజున బాబా దేహంలో కదలిక వస్తుంది. ఆయన నిదానంగా లేచి కూర్చోవడంతో భక్తులు సంతోషంతో పొంగిపోతారు. భక్తులతో గల బంధాన్ని భగవంతుడు తెంచుకోలేక తిరిగి వచ్చాడని సంబరాలు చేసుకుంటారు. ఆంగ్లేయ అధికారులను సైతం బాబా విషయం ఆశ్చర్యచకితులను చేస్తుంది. బాబా సాధారణ ఫకీరు కాదనీ ... సాక్షాత్తు భగవంతుడని భాటే వంటి వారు కూడా గుర్తించి ఆయన శిష్య బృందంలో చేరిపోతారు.

More Bhakti Articles