భక్తులను ఆదుకునే భగవంతుడు సాయి

భక్తులను ఆదుకునే భగవంతుడు సాయి
మనసుకన్నా గొప్పది మరేదీ లేదు ... విశ్వాసానికి మించిన శక్తి మరి దేనికీ లేదని బాబా చెబుతూ ఉండేవాడు. మశీదుకి ఎంతోమంది వచ్చినా, బాబా కొంతమంది దగ్గర నుంచి మాత్రమే దక్షిణగా రెండు రూపాయలు తీసుకుంటూ వుండేవాడు. అలా దక్షిణగా వచ్చిన వాటిలో కొన్ని నాణాలను మాత్రం బాబా తరచూ బొటన వ్రేలితో రుద్దుతూ ఉండేవాడు.

నాణాలను అరగదీస్తున్నట్టుగా బాబా అలా వాటిని రుద్దడం గమనించిన సహచరులు, అందుకు కారణమడిగితే, అవి ఇచ్చిన వారి పాపాలను తొలగిస్తున్నట్టుగా చెప్పేవాడట. అలా అనుక్షణం తన భక్తుల బాగు గురించి ఆలోచించడం వల్లనే బాబా అందరి బంధువయ్యాడు ... కోరిన వరాలను ప్రసాదిస్తూ కొండంత దేవుడయ్యాడు. బాబా పంచిన ప్రేమకు ప్రతీకలుగా ఆయా ప్రాంతాల్లో నిర్మించబడిన ఆలయాలు కనిపిస్తూ వుంటాయి.

అలాంటి విశిష్టమైన ఆలయాల్లో ఒకటి, వరంగల్ జిల్లా పరిధిలో గల 'పరకాల'లో కనిపిస్తుంది. బాబా విశాలమైన హృదయానికి నిదర్శనంగా ఇక్కడ ఆలయం దర్శనమిస్తూ వుంటుంది. ఆయనలోని ప్రశాంతత ఆలయమంతా పరచుకుని పవిత్రంగా అనిపిస్తూ వుంటుంది. అందమైన నగిషీలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దబడిన ఈ ఆలయం భక్తులకు ఆనందాశ్చర్యాలను కలిగిస్తుంది. ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం, ఈ క్షేత్రానికి మరింత విశేషాన్ని తెచ్చిపెడుతుంది.

వేదికపై గల బాబా ప్రతిమలో జీవం తొణికిసలాడుతూ వుంటుంది. ఈ మంటపంలోకి అడుగుపెడుతూ ఆయనని చూస్తే, మశీదులో కూర్చున్న ఆయన్ని స్వయంగా కలుసుకున్న అనుభూతి కలుగుతుంది. ఇక్కడి బాబా పట్ల విశ్వాసముంచితే, ఎలాంటి కష్టాల్లో వున్నా ఆయన చిటికెలో ఒడ్డుకు చేరుస్తాడని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. అభిషేకాలు .. అలంకరణలు .. హారతులు .. ఇంకా ఇతరసేవలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ వుంటారు. భజనలతో సందడి చేస్తూ .. ప్రతి గురువారం ఒక పండుగలా జరుపుకుంటారు.

More Bhakti Articles