అసమాన భక్తికి అసాధ్యమైనది లేదు

అసమాన భక్తికి అసాధ్యమైనది లేదు
జ్ఞానేశ్వరుడు చేసే ఆధ్యాత్మిక బోధనలు 'ఆళంది' గ్రామవాసులను ఎంతగానో ప్రభావితం చేస్తుంటాయి. దాంతో జ్ఞానేశ్వరుడి ఆశ్రమానికి వచ్చి ఆయన చేసే భజనల్లో పాల్గొనే భక్తుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంటుంది. ఇది సహించలేని కొందరు ... ఆ గ్రామం నుంచి జ్ఞానేశ్వరుడిని పంపించేయాలని నిర్ణయించుకుంటారు. అందులో భాగంగా 'చాంగదేవుడు' అనే మంత్రశక్తి సంపన్నుడైన ఒక యోగిని జ్ఞానేశ్వరుడిపైకి ఉసిగొల్పుతారు.

దాంతో చాంగదేవుడి శిష్యులు ఆళంది గ్రామానికి చేరుకొని, జ్ఞానేశ్వరుడిపై చెడుగా ప్రచారం చేయడం మొదలుపెడతారు. తాము దైవంగా భావిస్తోన్న జ్ఞానేశ్వరుడిని వాళ్లు దూషించడంతో గ్రామస్తులు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తారు. తన శిష్యులపై గ్రామస్తులు దాడికి దిగారని గ్రహించిన చాంగదేవుడు, తన మంత్రశక్తితో వాళ్లను అచేతనులను చేస్తాడు.

ఎక్కడి వాళ్లు అక్కడే అచేతనంగా ఉండిపోవడంతో, మిగతావాళ్లు ఆందోళన చెందసాగారు. తమ గురువుకి జ్ఞానేశ్వరుడు కోపాన్ని తెప్పించడం వల్లనే అలా జరిగిందనీ, ఆయన వచ్చి తమ గురువుకి క్షమాపణ చెప్పుకుంటే, అందరూ యధాస్థితికి వస్తారని గ్రామస్తులను చాంగదేవుడి శిష్యులు రెచ్చగొడుతూ వుంటారు.

ఈ విషయంలో జ్ఞానదేవుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడా అని అందరూ ఎదురుచూస్తుంటారు. తనని విశ్వసించిన వాళ్లు కొన్ని స్వార్ధ శక్తుల కారణంగా అచేతనంగా ఉండిపోయారనీ, వాళ్లని మామూలు స్థితికి తీసుకువచ్చి తనపై వారికి గల నమ్మకాన్ని నిలబెట్టవలసిందిగా జ్ఞానేశ్వరుడు భగవంతుడిని ప్రార్ధిస్తాడు. అంతే ... అప్పటి వరకూ అచేతనంగా పడివున్న వాళ్లంతా ఒక్కసారిగా చైతన్య వంతులవుతారు.

యధాస్థితిని పొందిన వాళ్లని చూడగానే, తిరగబడతారనే భయంతో చాంగదేవుడి శిష్యులు అక్కడి నుంచి పారిపోతారు. ఈ సంఘటన జ్ఞానేశ్వరుడుకి గ్రామస్తులలో గల భక్తి విశ్వాసాలను మరింత పెంచుతుంది. అసమానమైన ఆయన దైవభక్తిని దశదిశలా వ్యాపింపజేస్తుంది.

More Bhakti Articles