పాదరస శివలింగ పూజ ఇచ్చే ఫలితం ?

పాదరస శివలింగ పూజ ఇచ్చే ఫలితం ?
అంకితభావంతో ఆదిదేవుడిని పూజిస్తే పాపాలన్నీ పటాపంచలైపోతాయి. దోషాలన్నీ దూరదూరంగా జరిగిపోతాయి. ఈ కారణంగానే సదాశివుడిని అధిక సంఖ్యలో భక్తులు ఆశ్రయిస్తుంటారు. ఆ స్వామికి విశేష రీతిలో అభిషేకాలు నిర్వహిస్తూ సంతృప్తి చెందుతుంటారు. ఇక శివాలయం దగ్గరలో లేనివాళ్లు ... ఆ స్వామిని అనునిత్యం అభిషేకించి తరించాలనుకునే వాళ్లు పూజా మందిరంలోనే శివలింగాన్ని ఏర్పాటు చేసుకుంటూ వుంటారు.

ఒక్కో అభిషేక ద్రవ్యంతో శివుడికి అభిషేకం చేస్తే ఒక్కో విశేష ఫలితం చేకూరినట్టే, ఒక్కో రకమైన శివలింగాన్ని పూజించడం వలన ఒక్కో ఫలితం లభిస్తుందని చెప్పబడుతోంది. అందువలన శివానుగ్రహంతో ఆయా కోరికలను నెరవేర్చుకోవాలనుకునే వాళ్లు, తాము ఆశించే ఫలితాలను అందించే శివలింగాలను ఎంచుకుని నిత్యపూజలు నిర్వహిస్తుంటారు.

ఈ నేపథ్యంలో మిగతా శివలింగాలకన్నా పాదరస శివలింగం మరింత విశిష్టమైనదని చెప్పబడుతోంది. ఈ శివలింగం చాలా అరుదుగా కనిపిస్తూ వుంటుంది కాబట్టి, భక్తులు ప్రత్యేకమైన శ్రద్ధపెట్టి తయారుచేయించుకుంటూ వుంటారు. పాదరస శివలింగాన్ని పూజించడం వలన సమస్త పాపాలు నశిస్తాయి. పాపాలే అనారోగ్యానికి గురిచేస్తుంటాయి ... ఆర్ధికపరమైన ఇబ్బందులను కలిగిస్తుంటాయి.

చేసుకున్న పాపాలే వివిధ రూపాల్లో అభివృద్ధికి అడ్డుతగులుతుంటాయి. అలాంటి పాపాలు పాదరస శివలింగ పూజ వలన తొలగిపోతాయి. పాపాలు నశించబడిన జీవితం సుఖసంతోషాలతో కొనసాగుతుంది. అందుకే అంకిత భావంతో పాదరస శివలింగాన్ని అర్చించాలి. ఆ దేవదేవుడి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలి.

More Bhakti Articles