ఇక్కడ అప్సరసలు జలకాలాడుతూ ఉంటారట !

ఇక్కడ అప్సరసలు జలకాలాడుతూ ఉంటారట !
అందానికి కొలమానంగా అప్సరసలను గురించి చెబుతూ వుండటం ప్రాచీనకాలం నుంచి వుంది. కళ్లు చెదిరిపోయే సౌందర్యం అప్సరసల సొంతమనీ, దేవలోకంలో వాళ్లు నాట్యం చేస్తూ ఉంటారని అంటారు. అప్సరసలుగా చెప్పబడుతోన్న రంభ ... ఊర్వశి ... మేనక ... తిలోత్తమ వంటి కొందరి పేర్లు చాలామందికి సుపరిచితమే.

జానపద కథల్లోనూ ... చిత్రాల్లోనూ అప్సరసల జాడ తెలుసుకోవడానికి కథానాయకుడు ప్రయత్నించే తీరు అందరికీ ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తూ వుంటుంది. నిజంగానే అప్సరసలు వున్నారా ? ... వాళ్లను చూడటం జరిగేపనేనా ? అనే సందేహం చాలామందికి కలుగుతూ వుంటుంది. అయితే 'పచ్ మడీ' ప్రాంతంలో అడుగుపెట్టిన వాళ్లు మాత్రం, అప్సరసలు ఉన్నారనే విషయాన్ని నమ్మవచ్చని అనుకుంటారు. అందుకు కారణం ... అప్సరసలు ఇక్కడి జలపాతంలో జలకాలాడుతూ ఉంటారని స్థానిక గిరిజనులు చెబుతూ ఉండటమే.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాత్పుర పర్వత ప్రాంతంలో ఈ ప్రదేశం వుంది. ఈ పర్వత ప్రాంతమంతా కూడా పరమశివుడి పాద ధూళిచే పవిత్రమైనట్టుగా చెప్పబడుతోంది. దక్ష యజ్ఞానికి వెళ్లి అక్కడ అవమానించబడిన సతీదేవి ప్రాణత్యాగం చేసినప్పుడు, ఆమె దేహాన్ని భుజాన వేసుకుని పరమశివుడు ఇక్కడే సంచరించాడని అంటారు.

కొండ పైభాగం నుంచి కొత్త ఉత్సాహంతో దూకుతున్నట్టుగా కనిపించే ఇక్కడి జలపాతం ... ఇక్కడి పరిసరాలు చూడటానికి రెండు కళ్ళూ సరిపోవు. ఇక్కడ అప్సరసలు జలకాలడుతూ ఉంటారనీ, తమ పూర్వీకులలో కొందరు వాళ్లని చూశారని ఇక్కడి గిరిజనులు చెబుతుంటారు. ఈ కారణంగానే ఈ జలపాతాన్ని 'అప్సర విహార్'గా పిలుస్తుంటారు. ఈ విషయంలో నిజానిజాల మాట ఎలా వున్నా, అందమైన ఇక్కడి ప్రకృతి చిత్రం మనోఫలకంపై శాశ్వతంగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

More Bhakti Articles