రాయలవారి మనసు దోచుకున్న క్షేత్రం !

రాయలవారి మనసు దోచుకున్న క్షేత్రం !
శ్రీక్రిష్ణదేవరాయల వారి పరిపాలనా కాలం 'స్వర్ణయుగం' గా చెప్పబడుతోంది. ఆయన పాలనా కాలంలో అనేక కళలుతో పాటు ఆధ్యాత్మిక వైభవం కూడా వెలుగొందింది. ఆయన ఏలుబడిలో గల అనేక ప్రాంతాలను దర్శించినప్పుడు, అయన చేపట్టిన ఆలయ నిర్మాణాలు ... అభివృద్ధి కార్యక్రమాలు ... స్వామివారికి ఆయన సమర్పించిన ఖరీదైన కానుకలు ఆశ్చర్యచకితులను చేయకమానవు.

ఈ నేపథ్యంలో ఆయన దర్శించుకున్న అత్యంత విశిష్టమైన ఆలయంగా 'శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు' ఆలయం చెప్పబడుతోంది. ఈ ఆలయంలోనే 'ఆముక్త మాల్యద' కావ్యానికి శ్రీకృష్ణ దేవరాయలు శ్రీకారం చుట్టాడని ఇక్కడి స్థలపురాణం చెబుతోంది. స్వామివారే స్వయంగా కోరడంతో తాను ఈ కావ్యరచనకు పూనుకున్నట్టుగా రాయలవారే సెలవీయడం జరిగింది.

కావ్య ప్రపంచంలో ఆముక్తమాల్యదకు విశిష్టమైన స్థానం లభించింది. అలాంటి కావ్య రచన ఇక్కడే ఆరంభమైన కారణంగా, ఈ క్షేత్రం చెరిగిపోని చారిత్రక నేపథ్యాన్ని సొంతం చేసుకుని కనిపిస్తుంది. ఇక్కడి ఆముక్తమాల్యద మంటపాన్ని ... అందులో రాయలవారి విగ్రహాన్ని చూస్తే, అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతూ వుంటుంది. ఇక ఈ క్షేత్రంలో గల మరో ప్రత్యేకతగా, స్వామివారికి సమర్పించే నైవేద్యాలను గురించి చెప్పుకుంటూ వుంటారు.

ఎన్నో మహిమలు చూపుతూ భక్తుల మనసు దోచుకున్న ఇక్కడి స్వామివారికి అనునిత్యం చిట్టిగారెలు ... పాయసం ... దధ్యోదనం నైవేద్యంగా సమర్పిస్తుంటారు. స్వామివారికి ఇవి ఎంతో ఇష్టమనీ, అందుకే అనుదినం వీటిని నివేదన చేస్తూ ఉంటారని చెబుతుంటారు. ఎంతో రుచికరంగా వుండే ఈ ప్రసాదం దక్కడం తమ అదృష్టంగా భక్తులు భావిస్తుంటారు. హృదయమనే ఊయలలో ఆ స్వామికి పవళింపు సేవను నిర్వహిస్తూ వుంటారు.

More Bhakti Articles