విస్మయులను చేసే విశిష్ట క్షేత్రం

విస్మయులను చేసే విశిష్ట క్షేత్రం
ఏదైనా ఒక ప్రాచీన క్షేత్రానికి వెళితే అక్కడి నుంచి ఒక పట్టాన రాలేకపోవడం జరుగుతూ వుంటుంది. ఆ క్షేత్రం యొక్క పౌరాణిక ... చారిత్రక నేపథ్యం ఆసక్తిని కలిగిస్తూ ఉండటమే అందుకు కారణంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా ఆయా క్షేత్రల్లోని విశేషాలను బట్టే, ఆ క్షేత్రాలు ఎంతటి మహిమాన్వితమైనవో తెలుస్తూ వుంటుంది. అలాంటి విశిష్ట క్షేత్రాల జాబితాలో, 'పంచధార్ల' క్షేత్రం కూడా దర్శనమిస్తూ వుంటుంది.

విశాఖపట్నం సమీపంలో గల ఈ క్షేత్రంలో, శివుడు ... ధర్మలింగేశ్వరుడు పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు. ఈ క్షేత్రం అడుగడుగునా అనేక విశేషాలను ఆవిష్కరిస్తూ వుంటుంది. కుష్ఠువ్యాధి బారి నుంచి బయటపడటం కోసం సాక్షాత్తు యమధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని స్థలపురాణం చెబుతోంది.

నరసింహస్వామి సింహాచలంలో ఆవిర్భవించడానికి ముందు ఇక్కడికి వచ్చాడని అంటారు. అందుకు నిదర్శనంగా ఇక్కడ స్వామివారివిగా చెప్పబడే 'పాద ముద్రలు' కనిపిస్తూ వుంటాయి. ఈ ఆలయం శిరో భాగంలో 'ఫణిగిరి' పేరుతో ఒక కొండ కనిపిస్తూ వుంటుంది. ఈ కొండ ఆకారం కూడా సర్పరూపాన్ని తలపిస్తూ ఉంటుంది. ఈ క్షేత్రాన్ని నాగరాజు పర్యవేక్షిస్తూ ... సంరక్షిస్తూ ఉంటాడని అంటారు.

అందుకు తగినట్టుగానే అప్పుడప్పుడు ఇక్కడి ఆలయంలో ఓ 'శ్వేతనాగు' సంచరిస్తూ ఉంటుందట. ఈ సర్పం కంటపడిన వాళ్లు, తమని ధర్మలింగేశ్వరుడు అనుగ్రహించినట్టుగా ఆనందంతో పొంగిపోతుంటారు. ఇలా అనేక విశేషాలతో అలరారుతోన్న ఈ ఆలయం మహిమాన్వితమైనదిగా భక్తులు చెప్పుకుంటూ వుంటారు.

More Bhakti Articles