అమ్మవారు ఇక్కడ కనకవర్షం కురిపించిందట !

అమ్మవారు ఇక్కడ కనకవర్షం కురిపించిందట !
ఓ రోజున ఆదిశంకరులవారు భిక్షాటన చేస్తూ ఓ ఇంటిముందు ఆగుతాడు. నిరుపేదరాలైన స్త్రీ బయటికి వచ్చి ఆయన భిక్షా పాత్రలో ఉసిరికాయ వేస్తుంది. ఆ ఉసిరికాయ చూసిన శంకరుల వారు ఆమె ఎలాంటి పరిస్థితుల్లో జీవనాన్ని కొనసాగిస్తూ వుందో గ్రహిస్తాడు. ఆ క్షణమే లక్ష్మీదేవిని స్తుతిస్తూ ఆమెని ప్రసన్నం చేసుకుంటాడు. ఆ నిరుపేదరాలిని అనుగ్రహించ వలసిందిగా కోరతాడు. అప్పుడే అమ్మవారు ఆ పేదరాలి ముంగిట్లో బంగారు ఉసిరికాయలను కురిపిస్తుంది.

ఆదిశంకరుల వారి నోటివెంట వెలువడిన 'కనకధారాస్తవం' ... ఆ తరువాత కూడా కనకవర్షం కురిపించిందని చెబుతుంటారు. అలా లక్ష్మీదేవి కనకవర్షం కురిపించిన ప్రదేశంగా 'పంపాసరోవరం' తీరంలోని విజయలక్ష్మీ దేవి ఆలయం దర్శనమిస్తూ వుంటుంది. విజయనగర సామ్రాజ్య స్థాపనకు ముందు విద్యారణ్యుల వారు ఇక్కడే అమ్మవారి అనుగ్రహం కోసం పన్నెండు సంవత్సరాల పాటు తపస్సు చేశాడట.

అనునిత్యం ఆయన కనకధారాస్తవం చేయడం వలన అమ్మవారు ప్రత్యక్షమై కనకవర్షం కురిపించింది. ఆ సంపదనే ఆయన విజయనగర సామ్రాజ్య నిర్మాణానికి ఉపయోగించాడని చెబుతారు. అమ్మవారు అనుగ్రహించిన గుర్తుగానే ఆయన ఇక్కడ విజయలక్ష్మీదేవిని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించినట్టు ఇక్కడి స్థలపురాణం చెబుతోంది. రామాయణంలోని ఆసక్తికరమైన ఘట్టాలకు పంపాసరోవర ప్రాంతం వేదికగా నిలిచింది. అలాంటి ఈ ప్రదేశంలో ... కనకవర్షం కురిసినట్టుగా చెప్పబడుతోన్న విజయలక్ష్మీదేవి ఆలయాన్ని దర్శించడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

More Bhakti Articles