చేసిన పాపం చెబితే పోతుందా ?

చేసిన పాపం చెబితే పోతుందా ?
చేసిన పాపం చెబితే పోతుందనే మాట లోకంలో వినిపిస్తూ వుంటుంది. అంటే చేసిన పాపాన్ని బయటికి చెప్పగానే అది పూర్తిగా నశిస్తుందని కాదు. చేసిన పాపానికి పశ్చాత్తాపాన్ని చెంది, ఎవరికైతే ద్రోహాన్ని తలపెట్టారో వారి క్షమకు పాత్రులైనప్పుడు ఆ పాపఫలితం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇదే విషయాన్ని 'అంబరీషుడు' జీవితంలో జరిగిన ఒక సంఘటన నిరూపిస్తూ వుంటుంది.

అంబరీషుడి తమ్ముడు చిత్రసేనుడు రాజ్యాధికారం కోసం కలలుకంటాడు. వాటిని నిజం చేసుకోవడం కోసం అంబరీషుడిని అడవులకు పంపిస్తాడు. ఈ పథకం విజయవంతం కావడానికి చిత్రసేనుడికి సేనాపతి అన్ని విధాలుగా సహకరిస్తాడు. ఆ తరువాత మంచివాడైన మహామంత్రిపై నిందలు మోపి ఆయనని ఆ పదవి నుంచి తప్పించి, తాను ఆ పదవిలో కొనసాగుతాడు. చిత్రసేనుడిని తప్పుదోవ పట్టిస్తూ ప్రజలను అనేక విధాలుగా బాధలకు గురిచేస్తాడు.

అలాంటి సేనాపతి .. అడవిలో శ్రీ మహావిష్ణువు నామస్మరణలో తరిస్తోన్న అంబరీషుడికి హాని తలపెట్టడానికి బయలుదేరుతాడు. మార్గమధ్యంలో జరిగిన ఒక ప్రమాదం కారణంగా ఆయన చూపును కోల్పోతాడు. అతికష్టం మీద ఆయన అంబరీషుడి ఆశ్రమానికి చేరుకొని ఆయన పాదాలపై పడతాడు. ఆయనకీ తాను చేసిన ద్రోహాన్ని గురించి చెబుతాడు. అందువల్లనే భగవంతుడు తనని శిక్షించాడంటూ పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తాడు. భగవంతుడు శిక్షించినందుకు తాను బాధపడటం లేదనీ, క్షమించానని అంబరీషుడు ఒక్కసారి అంటే తన మనసు తేలిక పడుతుందని అంటాడు.

చూపులేకపోవడంతో అవస్థలు పడుతోన్న సేనాపతిని అంబరీషుడు అభిమానంతో అక్కున చేర్చుకుంటాడు. ఆయనకి చూపును ప్రసాదించవలసిందిగా భగవంతుడిని కోరతాడు. దాంతో సేనాపతికి చూపు వస్తుంది ... ఆనందంతో పొంగిపోతూ మరోమారు ఆయన అంబరీషుని పాదాలకు నమస్కరిస్తాడు. తనకి ద్రోహాన్ని తలపెట్టిన వ్యక్తిని పెద్దమనసుతో క్షమించి మంచిచేసిన అంబరీషుడుకి, ప్రజలు తమ హృదయాల్లో శాశ్వతమైన స్థానాన్ని ఇస్తారు.

More Bhakti Articles