పులకింపజేసే పూరి జగన్నాథుడి రథయాత్ర

పులకింపజేసే పూరి జగన్నాథుడి రథయాత్ర
సమస్త జగత్తును నడిపించే నాయకుడిగా జగన్నాథస్వామి కీర్తించబడుతున్నాడు. మానవాళికి తన లీలావిశేషాలను తెలియజేస్తూ, అశేష భక్త జనకోటిచే ఆరాధించబడుతున్నాడు. ఆయన ఆవిర్భవించిన మహా పుణ్యక్షేత్రంగా 'పూరి' దర్శనమిస్తుంది. ఈ క్షేత్రం శంఖాకారాన్ని కలిగి వుండటం వలన 'శంఖ క్షేత్రం' అని కూడా పిలుస్తుంటారు. ఒరిస్సా రాష్ట్రం .. భువనేశ్వర్ సమీపంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది.

ప్రతియేటా 'ఆషాఢ శుద్ధ విదియ' రోజున జగన్నాథుడి రథయాత్ర అంగరంగవైభవంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు ఈ క్షేత్రానికి తరలివస్తుంటారు. ఈ రథయాత్రను పరిశీలించినట్టయితే ఇది అనేక విశేషాల సమాహారంగా కనిపిస్తుంది.

సాధారణంగా ఏ క్షేత్రంలోనైనా శుభప్రదమైనవిగా చెప్పబడుతోన్న మాసాల్లో ఉత్సవాలు ఊరేగింపులు జరుగుతుంటాయి. కానీ అందుకు భిన్నంగా ఇక్కడ ఆషాఢమాసంలో ఉత్సవం నిర్వహించడం ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఎక్కడైనా గర్భాలయ మూర్తులు శిలతో తయారు చేయబడి వుంటాయి. ఒకవేళ ఆ శిలావిగ్రహాలు ఏమాత్రం దెబ్బతిన్నా అవి పూజకి పనికిరావని చెబుతుంటారు.

కానీ ఇక్కడి ప్రతిమలు చెక్కతో తయారుచేయబడి వుంటాయి. కాళ్లూ చేతులు పూర్తిగా మలచబడని కారణంగా అవి మొండివిగా కనిపిస్తుంటాయి. ఇతర క్షేత్రాల్లోని గర్భాలయాల్లో దైవమూర్తులు ఒక్కరుగా గానీ ... దంపత సమేతంగా కాని కొలువై కనిపిస్తుంటారు. అందుకు భిన్నంగా ఇక్కడి గర్భాలయంలో అన్నలైనటువంటి శ్రీకృష్ణ బలరాముల మధ్య సుభద్ర కొలువై వుండటం చిత్రంగా అనిపిస్తూ వుంటుంది.

ఇక ఇతర క్షేత్రాల్లో మూలమూర్తులుగా శిలా విగ్రహాలు ప్రతిష్ఠించబడి వుంటాయి కనుక, ఉత్సవ మూర్తులను ఊరేగిస్తూ వుంటారు. ఇక్కడ మాత్రం మూలమూర్తులుగా చెప్పబడుతోన్న చెక్క ప్రతిమలనే అలంకరించి ఊరేగిస్తూ వుంటారు. ఈ మూడు ప్రతిమలను ఒకే రథంలో కాకుండా మూడు రథాల్లో వేరువేరుగా ఊరేగిస్తూ వుండటం విశేషం. 'నంది ఘోషం' అనే పేరుగల రథంలో శ్రీకృష్ణుడిని ... 'తాళ ధ్వజం' అనే పేరుగల రథంలో బలరాముడిని ... 'దేవ దళనం' అనే పేరు గల రథంలో సుభద్రను ఊరేగిస్తూ వుంటారు.

ఇలా ఆలయం నుంచి బయలుదేరిన మూడు రథాలు స్వామి పినతల్లి స్థానంగా చెప్పబడుతోన్న 'గండీచ ఘర్' కి చేరుకొని దశమి వరకూ అక్కడే నిలిచిపోతాయి. తిరిగి ఏకాదశి నాడు ఈ మూర్తులు ఆలయానికి బయలుదేరుతాయి. అశేష ప్రజానీకంచేత హారతులు అందుకున్న ఈ చెక్క రథాలను ఒక్కసారికి మాత్రమే ఉపయోగించడం ... మూల మూర్తులను ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి మార్చడం మరోవిశేషంగా అనిపిస్తుంటుంది.

ఇలా అనేక విశేషాలు ఈ రథయాత్రలో కనిపిస్తూ వుంటాయి ... ప్రతి విశేషం వెనుక అందుకు గల కారణం వినిపిస్తూ వుంటుంది. ఇన్ని విశేషాల మధ్య కొనసాగే ఈ రథయాత్రను భక్తులు నయనానందకరంగా వీక్షిస్తుంటారు ... తమ జన్మ తరించినట్టుగా భావిస్తుంటారు.

More Bhakti Articles