లక్ష్మీ నారసింహుడు ఇక్కడ సంచరిస్తాడట !

లక్ష్మీ నారసింహుడు ఇక్కడ సంచరిస్తాడట !
సాధారణంగా గుట్టలపైన ... కొండలపైన ... గుహల్లోనూ నరసింహస్వామి ఆవిర్భవిస్తూ వుంటాడు. ఆయా ప్రాంతాలలో తగిన భక్తులను ఎంచుకుని వారికి తన జాడను తెలియజేసి వెలుగులోకి వస్తుంటాడు. అలా స్వామివారు కొలువుదీరిన క్షేత్రాలు అత్యంత శక్తిమంతమైనవిగా భక్తులు భావిస్తుంటారు. నరసింహస్వామి తమనీ ... తమ ఊరుని రక్షిస్తూ ఉంటాడని విశ్వసిస్తూ వుంటారు.

అలా భక్తులచే పూజలు అందుకుంటోన్న నరసింహస్వామి క్షేత్రం 'వెనిగండ్ల' లో దర్శనమిస్తుంది. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం పరిధిలో ఈ క్షేత్రం కనిపిస్తుంది. ఇక్కడి గుట్టపై గల బండరాయిపై లక్ష్మీనరసింహస్వామి వెలసిన రూపం దర్శనమిస్తూ వుంటుంది. ఈ గుట్టను చూసినా ... ఇక్కడి లక్ష్మీ నరసింహస్వామిని చూసినా ఇది ప్రాచీనమైన క్షేత్రమని తెలిసిపోతూ వుంటుంది.

స్వామివారు ఈ గుట్టపై దిగినప్పుడు ఏర్పడినట్టుగా చెబుతోన్న పాదముద్రలు ఇక్కడ కనిపిస్తుంటాయి. భక్తులు ముందుగా ఈ పాదముద్రలకు నమస్కరించుకుని, ఆ తరువాత వెలసిన రూపాన్ని దర్శించుకుంటూ వుంటారు. తమ పాడిపంటలు వృద్ధి చెందడానికి స్వామివారి అనుగ్రహమే కారణమని భావించి, ఆయనకి ఇష్టమైన నైవేద్యాలను సమర్పిస్తుంటారు. ఆపదలు ... అనారోగ్యాలు ... ఆర్ధికపరమైన ఇబ్బందులు కలగకుండా తమని ఆయనే కాపాడుతూ ఉంటాడని ప్రగాఢమైన విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు

స్వామివారి పట్ల కృతజ్ఞతా పూర్వకంగా ఇక్కడ ప్రతి యేటా సంక్రాంతి పండుగ రోజుల్లో అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఇక విశేషమేమిటంటే .. ఈ గుట్టపై రాత్రి సమయాల్లో స్వామివారు తిరుగుతూ ఉంటాడని అంతా నమ్ముతుంటారు. అందువలన ఆయన ఏకాంతానికి భంగం కలిగించకూడదనే ఉద్దేశంతో రాత్రి వేళలో ఎవరూ అక్కడికి వెళ్లడం జరగదని చెబుతుంటారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు మాత్రం, ఇంతటి స్థల మహాత్మ్యం గల ఈ క్షేత్రాన్ని మరింత అభివృద్ధి పరచవలసిన అవసరం కనిపిస్తుంది. తగిన ప్రాచుర్యం కల్పిస్తే బాగుంటుందని అనిపిస్తుంది.

More Bhakti Articles