శ్రీనివాసుడి వేట ఖడ్గాన్ని ఇక్కడ చూడొచ్చు

శ్రీనివాసుడి వేట ఖడ్గాన్ని ఇక్కడ చూడొచ్చు
తిరుమల తిరుపతిని ... ఆ చుట్టుపక్కల ప్రాంతాలను దర్శించినప్పుడు ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే అదంతా శ్రీనివాసుడు ... పద్మావతీదేవిల పాద ధూళిచే పవిత్రమైన పుణ్యభూమి. వాళ్లు నివసించినట్టుగా చెబుతోన్న ప్రదేశాలు ... చూపులు కలిసిన ప్రదేశం ... వివాహం జరిగిన ప్రదేశం ... కొండపైకి బయలుదేరి మార్గమధ్యంలో విడిది చేసిన ప్రదేశం నయనానందకరంగా దర్శనమిస్తూ వుంటాయి.

ఇలా శ్రీనివాసుడు - పద్మావతీదేవిల పాద స్పర్శచే అక్కడి నేలంతా పులకించిపోతూ వుంటుంది. ఆయా ప్రదేశాలను చూసినప్పుడు ఆ దృశ్యాలను ఊహించుకోకుండా ఎవరుమాత్రం ఉండగలరు ? ఇక స్వామివారికి ... అమ్మవారికి సంబంధించినవిగా చెబుతోన్న కొన్ని వస్తువులు కూడా ఇక్కడి ఆలయాల్లో కనిపిస్తూ, ఆ కాలంలోకి తీసుకుని వెళుతూ వుంటాయి.

తిరుమల ఆలయం ప్రాంగణంలో 'అనంతాచార్యులవారి గడ్డ పలుగు' వ్రేలాడదీసి కనిపిస్తుంది. ఆ గడ్డ పలుగుని అనంతాచార్యులవారు విసిరితేనే, బాలుడి రూపంలో వచ్చిన వేంకటేశ్వరస్వామి గడ్డానికి గాయం అయింది. అందువలన ఆ గడ్డ పలుగు చూడగానే, ఆ దృశ్యం కనులముందు కదలాడుతుంది. ఇక తిరుపతి సమీపంలో గల 'నారాయణ వరం' వెళితే అక్కడి ఆలయంలో స్వామివారి 'వేట ఖడ్గం' కనిపిస్తుంది. ఇక్కడే స్వామివారు అమ్మవారిని వివాహమాడారు.

స్వామివారు ధరించి తిరిగిన వేట ఖడ్గాన్ని ఈ ఆలయంలో చూడగానే, మనసు ఏదో తెలియని అనుభూతికి లోనవుతుంది. స్వామివారిచే స్పర్శించబడిన ఆ ఖడ్గాన్ని చూడటమే అదృష్టమని అనిపిస్తుంది. ఇక ఇదే ప్రాంగణంలో ఒక 'తిరగలి' కనిపిస్తుంది. వివాహం సందర్భంగా అమ్మవారికి నలుగు పెట్టడానికి అవసరమైన పిండి కోసం దీనిని ఉపయోగించారని చెబుతారు. ఈ తిరగలిని చూడగానే .. లోక కల్యాణం కోసం జరిగిన స్వామివారి కల్యాణాన్ని కనులముందు అందంగా ఆవిష్కరించుకోని వాళ్లుంటారా ? ఆనాటి ఆ పెళ్లి సందడిని తలచుకుని ... తలచుకుని తరించిపోని వాళ్లుంటారా?

More Bhakti Articles