భగవంతుడే తగిన మార్గాన్ని చూపిస్తాడు

భగవంతుడే తగిన మార్గాన్ని చూపిస్తాడు
ప్రశాంతమైన వాతావరణంలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటుచేసుకుని, తన భార్య పద్మావతితో కలిసి రాధాకృష్ణుల రమణీయ కథామృతాన్ని గానం చేస్తుంటాడు జయదేవుడు. మనసును మంత్రించే ఆ గీతాలను వింటూ అక్కడి ప్రజలు పరవశించిపోతుంటారు. ఒక రోజున జయదేవుడి ఆశ్రమంలోకి అడుగుపెట్టిన ఒక సాధువు, ఆయన గీతాలను వింటూ తనని తాను మరిచిపోయి అక్కడే కూర్చుండిపోతాడు.

అలా కొంత సమయం గడిచాక ఆశ్రమం బయటికి వచ్చిన జయదేవుడు, పారవశ్యంలో వున్న ఆ సాధువును చూసి ఆశ్చర్యపోతాడు. జయదేవుడి పిలుపుతో ఈ లోకంలోకి వచ్చిన ఆ సాధువు, ఆయన గీతాలలోని గొప్పతనాన్ని గురించి ప్రస్తావిస్తాడు. సాధారణ జనుల మనసులలోనే కాదు ... సాక్షాత్తు ఆ గోవిందుడి హృదయంలో సైతం ఆ గీతాలకు శాశ్వత స్థానం లభిస్తుందని అంటాడు. త్వరలోనే ఆయన రచనలకు తగిన గుర్తింపు ... గౌరవం లభిస్తాయని చెప్పి వెళ్లిపోతాడు.

ఆ రూపంలో వచ్చినది కృష్ణుడేనని ఆ సమయంలో జయదేవుడు గ్రహించలేకపోతాడు. పూరీ జగన్నాథస్వామి ఆలయ పరిసరప్రాంతాల్లో ఆ స్వామి సాధువు రూపంలోనే సంచరిస్తూ, జయదేవుడు రాసిన గీతాలను పాడటం మొదలుపెడతాడు. ఆ గీతాల పట్ల అక్కడి ప్రజలు విశేషంగా ఆకర్షితులవుతారు. ఈ విషయం పూరీ రాజుగారి వరకూ వెళ్లడంతో, ఆయన జయదేవుడిని తన ఆస్థానానికి పిలిపిస్తాడు.

ఆరంభంలో జయదేవుడి సాహిత్యం పట్ల ఆ రాజు అసూయను ప్రదర్శించినా, ఆ తరువాత ఆయన రచనల్లోని గొప్పతనాన్ని అంగీకరిస్తాడు. అలా అక్కడి నుంచి ఆ నోటా ఈనోటా మిగతా రాజ్యాలకు కూడా జయదేవుడి గీతాలు విస్తృతంగా వ్యాపిస్తాయి. ఆయనకి నవద్వీప మహారాజు ఆస్థానంలో ఉన్నతమైన స్థానాన్ని కల్పిస్తాయి.

More Bhakti Articles