అద్భుతమైన ఆ ఘట్టాలు ఇక్కడే జరిగాయట !

అద్భుతమైన ఆ ఘట్టాలు ఇక్కడే జరిగాయట !
పుణ్యక్షేత్రాలలో అడుగుపెట్టినప్పుడు అక్కడి స్థలప్రభావం కారణంగా నూతన ఉత్సాహం ... ఉత్తేజం చోటుచేసుకుంటాయి. ఆ పుణ్యక్షేత్రానికి గల పురాణపరమైన నేపథ్యం ... చారిత్రక ఘనతను గురించి తెలుసుకున్నప్పుడు అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. తాము దర్శించినది అనేక విశేషాలకు నిలయమై నిలిచిన మహిమాన్విత క్షేత్రమనే విషయం అర్థమవుతుంది. అలాంటి మహా పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలానికి చెందిన 'పట్టిసీమ' దర్శనమిస్తూ వుంటుంది. గోదావరి నదిచే స్పర్శించబడుతూ ... పులకించిపోతూ వుంటుంది.

దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేయడం కోసం, శివుడి అంశగా అవతరించిన వీరభద్రుడు ఇక్కడి 'దేవకూటాద్రి' పై ఆవిర్భవించాడు. భద్రకాళీ సమేత వీరభద్రుడు ఆవిర్భవించిన ఈ క్షేత్రానికి, శ్రీ భూ .. నీలా సమేత భావనారాయణ స్వామి క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తూ ఉండటం ఒక విశేషం. ఇక ఆదిపరాశక్తి అయిన అమ్మవారు ఇక్కడ గ్రామదేవతగా కొలువై ఉండటం మరో విశేషం.

వీరభద్రుడిపై భావనారాయణుడు తన చక్రాయుధాన్ని ప్రయోగించినదీ, ఆ తరువాత సహస్ర కమలాల పూజతో ఆయనని శాంతింపజేసి తిరిగి తన చక్రాన్ని పొందినది ఇక్కడేనని స్థలపురాణం చెబుతోంది. అగస్త్య మహర్షి కోరిక మేరకు వీరభద్రుడు ఇక్కడ లింగరూపంలో వీరేశ్వరుడుగా అవతరిస్తాడు. ఆనందంతో ఆత్మీయంగా ఆయనని అగస్త్య మహర్షి ఆలింగనం చేసుకుంటాడు. అందుకు నిదర్శనంగా ఇక్కడి వీరేశ్వర లింగంపై ఆయన హస్తముద్రలుగా చెప్పబడుతోన్న ఆనవాళ్లు కనిపిస్తూ వుంటాయి.

ఇక్కడి భద్రగుండంలో స్నానమాచరించి స్వామిని పూజించడం వల్లనే క్షత్రియ సంహారం వలన కలిగిన పాపాల నుంచి పరశురాముడు, బృహస్పతి పెట్టిన శాపం నుంచి చంద్రుడు విముక్తిని పొందారు. ఇలా అడుగడుగునా అనేక విశేషాలను ఆవిష్కరిస్తూ ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతోన్న కారణంగానే, ఇది మహిమాన్విత క్షేత్రమని భక్తులు విశ్వసిస్తూ వుంటారు. ఈ క్షేత్రాన్ని దర్శించడాన్ని తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తుంటారు.

More Bhakti Articles