పుట్టలో నుంచి గర్భగుడిలోకి !

పుట్టలో నుంచి గర్భగుడిలోకి !
సాధారణంగా ఎవరైనా పెద్దవాళ్లు ఇంటికి వచ్చినప్పుడు, వాళ్ల గురించి అంతగా తెలియని పిల్లలు వాళ్ల మనసుకి కష్టం కలిగించేలా ప్రవర్తించడం జరుగుతూ వుంటుంది. ఆ విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు, ఆ క్షణంలో తమ పిల్లలను మందలించడం ... ఆ తరువాత శిక్షించడం జరుగుతూ వుంటుంది.

సాక్షాత్తు పార్వతీదేవి కూడా కుమారస్వామి విషయంలో ఇదే పనిచేసింది. ఫలితంగానే ఈనాటి కృష్ణా జిల్లాలో గల 'మోపిదేవి' క్షేత్రంలో సుబ్రహ్మణ్యస్వామి కొలువై భక్తులను అనుగ్రహించడం జరుగుతోంది. ఒకసారి శివపార్వతుల దర్శనార్ధమై కొంతమంది మహర్షులు కైలాసానికి రాగా, వాళ్ల మనసులు నొచ్చుకునేలా కుమారస్వామి ప్రవర్తిస్తాడు. అది గ్రహించిన పార్వతీదేవి ... భూలోకంలో లింగారాధన చేస్తూ ఉండిపొమ్మని శపిస్తుంది.

దాంతో ఒకప్పుడు 'మోహినీపురం'గా పిలవబడిన ఈ ప్రదేశానికి వచ్చిన కుమారస్వామి, సర్ప రూపంలో పుట్టలో ఉంటూ లింగారాధన చేయడం మొదలుపెడతాడు. కాలక్రమంలో ఒక భక్తుడుకి కలలో సుబ్రహ్మణ్యస్వామి కనిపించి, తన జాడను తెలియజేస్తాడు. అలా నాగపడగలు కలిగిన శివలింగం స్వయంభువుగా వెలుగులోకి వచ్చింది. సుబ్రహ్మణ్యస్వామి .. లింగారాధన చేస్తున్నట్టుగా, పాము చుట్టలే పానవట్టంగా కలిగిన శివలింగం ఇక్కడి గర్భాలయంలో దర్శనమిస్తూ వుంటుంది.

సుబ్రహ్మణ్యస్వామి ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడనడానికి నిదర్శనంగా, ఆలయ ప్రాంగణంలో గల పుట్టలో తరచూ ఒక పాము కనిపిస్తూ ఉంటుందట. ఈ పుట్టలో నుంచి స్వామివారి గర్భాలయంలోకి దారి ఉందని భక్తులు చెబుతుంటారు. సర్పాకారాన్ని కలిగిన సుబ్రహ్మణ్య స్వామి అప్పడప్పుడు ఈ మార్గం ద్వారానే గర్భగుడిలో నుంచి పుట్టలోకి వచ్చి భక్తులకు ప్రత్యక్ష దర్శనమిస్తూ ఉంటాడని విశ్వసిస్తూ వుంటారు.

ఇందుకు నిదర్శనంగా గర్భాలయంలోని పానవట్టం కింద ఒక రంధ్రం కనిపిస్తూ వుంటుంది. స్వామివారిని పాలతో అభిషేకించే సమయంలో కొన్ని పాలను ఈ రంధ్రంలో పోస్తూ వుంటారు. సుబ్రహ్మణ్యస్వామి ఈ క్షేత్రంలో ప్రత్యక్షంగా కొలువై ఉన్నాడనడానికి ఇలా ఎన్నో నిదర్శనాలు చూపబడుతున్నాయి కనుక, ఈ క్షేత్రం మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోంది.

More Bhakti Articles