సూర్యుడే దిగివచ్చి దానమిచ్చిన వేళ !

సూర్యుడే దిగివచ్చి దానమిచ్చిన వేళ !
సూర్యభగవానుడు ... ప్రత్యక్ష నారాయణుడిగా పూజించబడుతూ వుంటాడు. సమస్త జీవరాశి ఆయన కరుణా కిరణాలతోనే తమ మనుగడను కొనసాగిస్తూ వుంటుంది. ఆయన తీవ్రతను ఎవరూ ప్రశ్నించలేరు ... ఆయనను ఏ విధంగాను ఆదేశించనూ లేరు. అసలు ఆయన తేజస్సును కన్నెత్తి నేరుగా చూడలేరు. ఆయన అనుగ్రహం కారణంగా సమస్త జీవులకు ఆహారాన్ని అందించే ప్రకృతి, ఆయనకి ఆగ్రహం కలిగిందంటే సర్వనాశనమైపోతుంది.

అలాంటి సూర్య భగవానుడిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన వాడిగా 'జమదగ్ని మహర్షి' కనిపిస్తాడు. ఒకసారి ఆశ్రమ ప్రాంగణంలో జమదగ్ని మహర్షి ఒక ముఖ్యమైన కార్యసాధనలో నిమగ్నమై ఉంటాడు. తాను ఆరంభించిన పని పూర్తి కాకుండా కదలకపోవడం ఆయన నైజం. కార్యసాధనలో వున్న ఆయనకి ఎండ తీవ్రత అసహనాన్ని కలిగిస్తూ వుంటుంది.

ఎండ వేడిమిని భరిస్తూనే ఆయన తన పనిని కొనసాగిస్తూ వుంటాడు. కానీ అంతకంతకూ ఆ తీవ్రత పెరిగిపోతూ ఉండటంతో, ఆయన ఏకాగ్రత దెబ్బతింటుంది. అప్పటివరకూ గల అసహనం ఒక్కసారిగా ఆగ్రహంగా మారుతుంది. దాంతో తన కార్యసాధనకు భంగం కలిగిస్తోన్న సూర్యుడిపట్ల ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తాడు.

జమదగ్ని మహర్షి ఎంతటి తపోబల సంపన్నుడో, ఆయన ఆగ్రహావేశాలు ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తాయో సూర్యుడికి బాగా తెలుసు. అందువలన ఆయన క్షణం కూడా ఆలస్యం చేయకుండా జమదగ్ని ఆశ్రమ ప్రాంగణానికి చేరుకుంటాడు. వస్తూనే జమదగ్నిని ఆప్యాయంగా పలకరించి, తన కర్తవ్య నిర్వహ ణ గురించి ఆయనకి తెలియనిది ఏముందంటూ జమదగ్నిని శాంతింపజేస్తాడు.

ఎండ తీవ్రత నుంచి కాపాడతాయంటూ జమదగ్నికి వెదురుతో చేయబడిన గొడుగును ... చెక్కతో చేయబడిన పాదరక్షలను దానంగా ఇస్తాడు. తన తీవ్రత కారణంగా బాధపడుతోన్న వాళ్లకి ఎవరు దానంగా గొడుగూ ... పాదరక్షలు ఇచ్చినా, విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తాయని ఆ సమయంలోనే సూర్యుడి చెబుతాడు. ఈ కారణంగానే వేసవి సమయంలో గొడుగులు ... పాదరక్షలు దానంగా ఇవ్వడం జరుగుతూ వుంటుంది.

More Bhakti Articles