సకల శుభాలను ప్రసాదించే శంకరుడు

సకల శుభాలను ప్రసాదించే శంకరుడు
లోక కల్యాణం కోసం అసురులను అంతమొందించడానికి ముందుండే శివుడు, తన భక్తులను అనుగ్రహించడంలోను ముందే వుంటాడు. ప్రేమగా పిలుస్తూ ... ఆప్యాయంగా పలకరిస్తూ ... కాసిని నీళ్లతో అభిషేకం చేస్తే చాలు, ఆయన మురిసిపోతూ తన భక్తులకు అవసరమైన వరాలను ఆనందంగా అనుగ్రహిస్తూ వుంటాడు. శక్తి కొద్దీ ఆయనకి ఉపచారాలు చేస్తే చాలు, సంతోషపడిపోయి సంతృప్తికరమైన జీవితాన్ని ప్రసాదిస్తూ వుంటాడు.

శివుడికి జరిపే ఒక్కో ఉపచారం ఒక్కో విశేషమైన ఫలితాన్ని ప్రసాదిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో శివుడికి చేసే ఉపచారాలలో తాంబూలానికి కూడా విశిష్టమైన స్థానం ఇవ్వబడింది. సదాశివుడికి తాంబూలాన్ని సమర్పించడం వలన దంపతుల మధ్య అనుబంధం మరింత బలపడటమే కాకుండా, సిరిసంపదలు కలుగుతాయని చెప్పబడుతోంది. కనుక సదాశివుడికి తాంబూలాన్ని సమర్పించడం మరిచిపోకూడదు.

ఇక శివుడిని 'ప్రదోష కాలం'లో పూజించడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ సమయంలో కైలాసంలో శివపార్వతులతో పాటు, ముక్కోటి దేవతలు కూడా ఉంటారట. అందువలన ఈ సమయంలో శివుడిని పూజించడం వలన, సమస్త దేవతలను ఆరాధించిన ఫలితం దక్కుతుందని చెబుతుంటారు. ప్రదోష కాలంలో తనని పూజించిన వారి సమస్త దోషాలను శంకరుడు తొలగించి సకల శుభాలను ప్రసాదిస్తాడని అంటారు.

More Bhakti Articles