భగవంతుడి నామాన్ని పలికితే చాలు

భగవంతుడి నామాన్ని పలికితే చాలు
నిత్య జీవితంలో ఉదయం నిద్రలేచినది మొదలు ఎన్నో అనవసరమైన మాటలు మాట్లాడటం జరుగుతూ వుంటుంది. వాటిని కొంతసేపు పక్కనపెట్టి, భగవంతుడు గురించిన నాలుగు మంచి మాటలు మాట్లాడటానికి ప్రయత్నం చేసేవాళ్లు చాలా తక్కువమంది ఉంటారనే చెప్పాలి. ఎంత సమయం తీరికగా ఉన్నా ఇతర విషయాల పట్ల దృష్టి పెడతారేగానీ, భగవంతుడి నామాన్ని పలకాలనే ధ్యాస మాత్రం ఉండదు.

పనిగట్టుకుని ఎలాగో దేవుడి నామాన్ని పలకడం తక్కువ కాబట్టి, పూర్వం తమ సంతానంలో మగ పిల్లలకి దేవుడి పేర్లు ... ఆడ పిల్లలకు అమ్మవారి పేర్లు పెట్టేవాళ్లు. ఏదో ఒక పనిమీద పొద్దస్తమానం వాళ్లని పేరుపెట్టి పిలవడం జరుగుతుంటుంది కాబట్టి, భగవంతుడి నామాన్ని పలికిన ఫలితం కలుగుతుందని భావిస్తూ వుండేవాళ్లు. తీరిక సమయాల్లోనే కాదు ఎవరి పని వాళ్లు చేస్తూ కూడా దైవ నామస్మరణ చేయవచ్చు.

భగవంతుడి నామాన్ని పలకడం వలన ఎలాంటి వారికైనా ఉత్తమగతులు లభిస్తాయనడానికి ఉదాహరణగా శిశుపాలుడు కనిపిస్తాడు. శ్రీకృష్ణుడి పట్ల ద్వేష భావాన్ని పెంచుకున్న శిశుపాలుడు, ఆయనని అనేక విధాలుగా దూషిస్తూ వస్తాడు. శ్రీ కృష్ణుడి సహనాన్ని అలుసుగా తీసుకుని అనేక విధాలుగా విమర్శిస్తూ, ఆయన చేతిలోనే ప్రాణాలు కోల్పోతాడు. అయితే అంతా అనుకున్నట్టుగా శిశుపాలుడు నరకానికి కాకుండా స్వర్గానికి వెళతాడు.

నిందిస్తూనో ... ద్వేషిస్తూనో ... దూషిస్తూనో ఆయన శ్రీకృష్ణుడి నామాన్ని పదే పదే పలకడం జరుగుతుంది. అలా భగవంతుడి నామాన్ని పలకడం వలన అది పుణ్య ఫలంగా మారుతుంది. అందువల్లనే శిశుపాలుడికి ఉత్తమగతులు లభించాయి. నిందించే ప్రయత్నంలో భాగంగా భగవంతుడి నామాన్ని పలికితేనే శిశుపాలుడి కోసం స్వర్గ ద్వారాలు తెరచుకుంటే, ఇక ఆ స్వామిని అనునిత్యం సేవిస్తూ అనుక్షణం ఆయన నామాన్ని స్మరిస్తూ వుండే వారికి స్వర్గలోకంలో ఎలాంటి స్థానం లభిస్తుందో ఒకసారి ఊహించుకోవచ్చు. అందుకే నిరంతరం భగవంతుడి నామాన్ని పలుకుతూ వుండాలి ... అనంతమైన పుణ్యఫలాలను అందుకుంటూ తరించాలి.

More Bhakti Articles