అదంతా మహాదేవుడి మహిమేనట !

అదంతా మహాదేవుడి మహిమేనట !
మహాదేవుడు ఆవిర్భవించిన క్షేత్రాలను దర్శించినప్పుడు, ఆయా క్షేత్రాలు ఆయన లీలా విశేషాలకు వేదికలుగా కనిపిస్తూ వుంటాయి. ఒక్కో క్షేత్రంలో అనేక విశేషాలను ఆవిష్కరిస్తూ, తాను ఆ ప్రదేశంలో ప్రత్యక్షంగా కొలువై ఉన్నట్టుగా భక్తులకు తెలియపరుస్తూ వుంటాడు. ఆదిదేవుడి మహిమలను అర్థం చేసుకున్న భక్తులు, మరింత భక్తిశ్రద్ధలతో ఆయనని సేవిస్తూ ... తరిస్తూ వుంటారు.

అలా భక్తుల హృదయాలలో చోటు సంపాదించుకున్న దైవంగా మనకి 'సంగమేశ్వరుడు' దర్శనమిస్తుంటాడు. కృష్ణా జిల్లా 'నాగాయలంక' ప్రాంతానికి సమీపంలో ఈ స్వామి దర్శనమిస్తుంటాడు. ఇక్కడి శివలింగాన్ని వశిష్ఠ మహర్షి ప్రతిష్ఠించినదిగా చెబుతుంటారు. ఇక్కడి స్థలమహాత్మ్యాన్ని గురించి తెలుసుకున్న చోళరాజులు స్వామివారికి ఆలయాన్ని నిర్మించారు.

అయితే ఒకసారి .. చోళుల నిర్మాణంలో భాగంగా కనిపిస్తోన్న ఒక మంటపాన్ని పునరుద్ధరించాలనే ప్రయత్నం జరిగిందని చెబుతారు. ఇందుకోసం ఆ మంటప స్తంభాలను కదిలించవలసింది. ఎంతగా తవ్వినా అలనాటి స్తంభాల అడుగుభాగం మాత్రం తగలక పోవడం అక్కడివారిని ఆశ్చర్యచకితులను చేసింది. దాంతో ఆ మంటప పునరుద్ధరణ కార్యక్రమాన్ని తలపెట్టడం స్వామివారికి ఇష్టంలేదని వాళ్లు భావించారు.

ఇక ఇప్పటికీ ఒక్కోసారి అర్చకులు స్వామివారి గర్భాలయం తలుపులు తీయగానే, లోపల శివలింగానికి చుట్టుకుని ఒక మహాసర్పం కనిపిస్తూ ఉంటుందట. ఎంతో పొడవుగా ... తేజస్సుతో వెలిగిపోతూ కనిపించే ఆ నాగుపాము, కొంతసేపు స్వామివారిని ఆలింగనం చేసుకుని అలాగే ఉంటుందట. అలా కొంతసేపటి తరువాత అది అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అయితే సాధారణ పాముల మాదిరిగా మనుషుల అలికిడి వినిపించగానే కంగారుపడిపోయి పారిపోవడానికి ప్రయత్నించడం వంటిది ఈ పాము చేయకపోవడం ఆశ్చర్యచకితులను చేస్తుంది.

నిర్భయంగా ... నిదానంగా అందరూ చూస్తుండగానే అది అక్కడి నుంచి నిష్క్రమిస్తుంది. నాగరాజు స్వామివారిని పూజించి వెళుతున్నట్టుగా భక్తలు విశ్వసిస్తుంటారు ... ఆ మహాసర్పం కనిపించడాన్ని అదృష్టంగా భావిస్తూ వుంటారు. ఈ క్షేత్రంలో ఏది విశేషంగా కనిపించినా .... అనిపించినా అది ఆ మహాదేవుడి మహిమేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని అంటూవుంటారు.

More Bhakti Articles