శివలింగానికి నాసికా రంధ్రాలు !

శివలింగానికి నాసికా రంధ్రాలు !
సదాశివుడు ఆవిర్భవించిన వివిధ క్షేత్రాలను దర్శించినప్పుడు, అక్కడ గల వివిధ విశేషాలు భక్తులను ఆనందాశ్చర్యాలకు గురిచేస్తుంటాయి. స్వామివారు స్వయంభువుగా ఆవిర్భవించిన కొన్ని క్షేత్రాల్లో, లింగరూపంపై చిత్రమైన ముద్రలు కనిపిస్తుంటాయి. వాటిని గురించి అక్కడ ఆసక్తికరమైన కథనాలు వినిపిస్తూ వుంటాయి. మరికొన్ని క్షేత్రాల్లో శివలింగంపై గల రంధ్రాల నుంచి అదే పనిగా నీరు వస్తూ వుంటుంది. ఆ నీళ్లు ఎక్కడి నుంచి ఎలా వస్తున్నాయన్నది ఎవరికీ అంతుబట్టదు.

ఇక ఈ తరహా ఆసక్తికరమైన కథనమే 'కాళేశ్వరం' క్షేత్రంలోను వినిపిస్తుంది. కరీంనగర్ జిల్లా పరిధిలో విలసిల్లుతోన్న ఈ క్షేత్రంలో, ఒకే పానవట్టంపై రెండు శివలింగాలు పక్కపక్కనే దర్శనమిస్తూ వుంటాయి. ముక్తీశ్వరుడు పేరుతో శివుడు ... కాళేశ్వరుడు పేరుతో యముడు పూజలు అందుకుంటూ వుంటారు. అయితే శివుడు కంటే ముందుగా యముడు పూజలు అందుకుంటూ వుండటం భక్తులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అందుకు గల కారణమేవిటో తెలుసుకున్న తరువాత సందేహం తీరుతుంది.

ఇక ఇక్కడి ముక్తీశ్వర లింగానికి రెండు ' నాసికా రంధ్రాలు' వుండటం విశేషంగా చెబుతుంటారు. ఈ నాసికా రంధ్రాల గుండా ఎంత నీరు పోసినా లోపలికి వెళుతుంటాయే గాని వెనక్కి తిరిగిరావు. మరి ఈ నీళ్లన్నీ ఏమవుతున్నాయంటే ... 'త్రివేణి సంగమం' లో కలుస్తున్నాయని చెప్పబడుతోంది. అవును ... ఈ నాసికా రంధ్రాలలో పోసిన నీరు త్రివేణి సంగమంలో కలుస్తుందని అంటారు. ఇది నిజమేనని నిరూపించే సంఘటనలు జరిగిన సందర్భాలు లేకపోలేదు.

త్రిలింగ క్షేత్రాల్లో ఇది ఒకటి కావడం .. ఒకే పానవట్టంపై రెండు శివలింగాలు ఉండటం ... ఇక్కడ తన కంటే ముందుగా పూజలు అందుకోమని యముడితో శివుడే చెప్పడం .. ముక్తీశ్వరుడి నాసికా రంధ్రాల గుండా నీరు త్రివేణి సంగమంలో కలవడం వంటి విశేషాలకు నిలయంగా ఈ క్షేత్రం అలరారుతోంది. మహిమాన్వితమైన మహాదేవుడి క్షేత్రంగా విలసిల్లుతోంది.

More Bhakti Articles