నేరేడుపండ్ల రసంతో శివుడిని అభిషేకిస్తే ?

నేరేడుపండ్ల రసంతో శివుడిని అభిషేకిస్తే ?
గరళాన్ని మింగిన శివుడు ఆ తాపాన్ని తట్టుకోవడానికి చల్లదనాన్ని ఎక్కువగా కోరుకుంటూ వుంటాడు. ఈ కారణంగానే స్వామి మంచుకొండల మధ్య నివసిస్తుంటాడు. అనునిత్యం భక్తుల నుంచి అభిషేకాలు ఆశిస్తూ వుంటాడు. లోక కల్యాణం కోసం స్వామివారు కాలకూట విషాన్ని కంఠంలో దాచుకున్నాడు కనుక, స్వామివారికి ఉపశమనాన్ని కలిగించడానికి భక్తులంతా ప్రయత్నిస్తూ వుంటారు. పంచామృతాలతోను ... ఫల రసాలతోను అభిషేకాలు చేయిస్తూ వుంటారు.

ఒక్కో అభిషేక ద్రవ్యంతో స్వామివారిని అభిషేకించడం వలన ఒక్కో ఫలితం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. అందువలన ఆయా మనోభీష్టాలను నెరవేర్చుకోవాలని అనుకునే వాళ్లు, ఆయా ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేయిస్తూ వుంటారు. ఈ నేపథ్యంలో .. విజయాలను కోరుకునే వాళ్లు స్వామివారిని 'నేరేడుపండ్ల రసం'తో అభిషేకించాలని చెప్పబడుతోంది.

నేరేడుపండ్లను ఏదైనా పాత్రలో ఉంచితే నల్లని వర్ణంలో గల 'సాలగ్రామాలు' గా అనిపిస్తుంటాయి. ఇక చేతి వేళ్ల మధ్య నిలువుగా వుంచి పట్టుకుంటే, అచ్చం శివలింగాలను పోలి కనిపిస్తుంటాయి. అటు సాలగ్రామాలు ... ఇటు శివలింగాల మాదిరిగా ఉండటమే నేరేడుపండ్ల ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఇంతటి విశిష్టత కలిగిన నేరేడు పండ్ల రసంతో శివలింగాన్ని అభిషేకిస్తే, ఆశించే విజయాలు అందుతాయని అంటారు.

జీవితంలో అనుకున్న గమ్యానికి చేరుకోవాలంటే, అడుగడుగునా విజయాలను అందుకుంటూ ముందుకుసాగాలి. విజయమే సంపదలను ... కీర్తి ప్రతిష్ఠలను తెచ్చిపెడుతుంది. పరమశివుడిని నేరేడుపండ్ల రసంతో అభిషేకిస్తే, విజయాలను సాధించాలనే వారి కోరిక నెరవేరుతుందని చెప్పబడుతోంది.

More Bhakti Articles