అదే ఇక్కడి శ్రీనివాసుడి మహిమ

అదే ఇక్కడి శ్రీనివాసుడి మహిమ
తిరుపతికి సమీపంలో గల 'శ్రీనివాసమంగాపురం' ఇటు పురాణపరంగాను ... అటు చారిత్రక పరంగాను వైభవాన్ని సంతరించుకుని కనిపిస్తూ వుంటుంది. ఇక్కడి ప్రశాంతత ... ఆహ్లాదకరమైన వాతావరణం కారణంగానే అమ్మవారితో పాటు స్వామి విడిది చేశాడేమోనని అనిపిస్తూ వుంటుంది. నూతన వధూవరులుగా అమ్మవారు ... స్వామివారు ఇక్కడికి వచ్చారు కనుక, ఇక్కడి స్వామి బుగ్గన చుక్కతో దర్శనమిస్తూ వుంటాడు.

గర్భాలయంలో భారీగా ... బలిష్టంగా నిలువెత్తున కొలువైన స్వామివారి దివ్యమంగళమూర్తిని చూడటానికి రెండుకళ్లు సరిపోవు. మనోహరుడైన ఈ స్వామి శత్రువులను హడాలెత్తించాడని చెబుతుంటారు. హిందూ దేవాలయాలను కొల్లగొడుతూ మతపరమైన దాడులు జరుగుతున్న రోజులవి. ఆ సమయంలోనే 'హైదర్ అలి' అనుచరులు ఈ దేవాలయంపై విరుచుకుపడ్డారట.

గర్భాలయంలోకి ప్రవేశించాలనుకున్న వాళ్లకి స్వామివారు ఎలా కనిపించాడో తెలియదు గానీ, ఒక్కరు కూడా లోపలికి అడుగుపెట్టలేక భయంతో వెనుదిరిగారట. అలాంటి పరిస్థితుల్లో స్వామివారి నిత్యసేవలకు కొంతకాలం పాటు అంతరాయం కలిగింది. అప్పుడు స్వామివారు 'కాంచీపురం'లో గల సుందరరాజస్వామి అనే అర్చకుడికి స్వప్నంలో కనిపించి, శ్రీనివాస మంగాపురంలో గల తనకి తిరిగి పూజాది కార్యక్రమాలను నిర్వహించవలసిందిగా చెప్పాడట.

స్వామివారు తనని ఆదేశించడం తన పూర్వజన్మ సుకృతంగా భావించిన ఆయన, అక్షరాలా దానిని ఆచరణలో పెట్టడం జరిగింది. ఇలా స్వామివారు తన భక్తుడికి కలలో కనిపించి ఆదేశించిన రోజుని కూడా ఈ క్షేత్రంలో ఓ పర్వదినంగా జరుపుతుంటారు. ఈ రోజుని పురస్కరించుకుని ప్రతి యేటా మూడురోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తూ వుండటం విశేషం.

More Bhakti Articles