పిశాచ బాధనుంచి బయటపడిన రాకుమారి !

పిశాచ బాధనుంచి బయటపడిన రాకుమారి !
తిరుజ్ఞాన సంబందర్ అనేక ప్రదేశాలలో పర్యటిస్తూ, అక్కడి క్షేత్రాలను దర్శిస్తూ ముందుకు సాగుతుంటాడు. మార్గమధ్యంలో తనని ఆశ్రయించినవారిని ఆయన ఆదుకునే విధానం చూసిన వాళ్లు, వాటిని మహిమలుగా ప్రచారం చేయసాగారు. ఆ విధంగా పెరుగుపోతున్న తన కీర్తి ప్రతిష్ఠలను సంబందర్ ఎంతమాత్రం పట్టించుకునేవాడు కాదు. తాను నిమిత్త మాత్రుడననీ ... తన వలన ఎవరు మంచి ఫలితాన్ని పొందినా అందుకు కారకుడు ఆ దేవదేవుడనే చెప్పేవాడు.

అలాంటి సంబందర్ ఒక రాజ్యానికి చేరుకోగా, ఆయన గొప్పతనాన్ని గురించి తెలుసుకున్న ఒక రాజుగారు వచ్చి కలుసుకుంటాడు. యుక్త వయసులోకి అడుగుపెట్టిన తన కూతురు చిత్రంగా ప్రవర్తిస్తోందనీ, ఆమెకి గల అనారోగ్యమేమిటో రాజవైద్యులు తేల్చలేకపోయారని చెబుతాడు. కూతురి అనారోగ్యం తమని మానసికంగా కుంగదీస్తోందనీ, ఈ సమస్య నుంచి తమని గట్టెక్కించే శక్తిసామర్థ్యాలు ఆయనకి మాత్రమే ఉన్నాయని అంటాడు.

రాజుగారి మనసు ప్రశాంతంగా ఉంటేనే పరిపాలన సజావుగా కొనసాగుతుంది. లేదంటే పరిపాలన కుంటుపడుతుందని గ్రహించిన సంబందర్ ఆయనతో పాటు అంతఃపురానికి చేరుకుంటాడు. రాకుమారిని చూడగానే ఆమెను ఓ పిశాచి పట్టిపీడిస్తోందనే విషయం ఆయనకి అర్థమైపోతుంది. మహా శివభక్తుడైన సంబందర్ అడుగుపెట్టిన కారణంగా ఆ ప్రదేశం పవిత్రమై ... శక్తిమంతమవుతుంది. అలాంటి ఆ ప్రదేశంలో ఆ పిశాచి ఉండలేక, రాకుమారి శరీరాన్ని వదిలి పారిపోతుంది.

అది తిరిగిరాకుండా మంత్రప్రయోగం చేసిన సంబందర్, విషయమేమిటనేది రాజుగారికి చెబుతాడు. రాకుమారి మామూలు స్థితికి చేరుకోవడం పట్ల రాజు ఆనందంతో పొంగిపోతాడు. ఎంతోకాలంగా వేధిస్తోన్న సమస్యను, అడుగుపెట్టడంతోనే పరిష్కరించిన ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తాడు. అదంతా పరమశివుడి లీలా విశేషమనీ, ఆయనకి అసాధ్యమైనది ఏముంటుందంటూ ఆ స్వామిని కీర్తిస్తూ అక్కడి నుంచి సంబందర్ వెళ్లిపోతాడు.

More Bhakti Articles