అవహేళనకు ఫలితం అనుభవించక తప్పదు

అవహేళనకు ఫలితం అనుభవించక తప్పదు
సాధారణంగా తమ కంటే బలహీనులను ... తక్కువ స్థాయివారిని కొంతమంది అవహేళన చేస్తుంటారు. తమ చుట్టూ వున్న వారిని నవ్వించడం కోసం వాళ్లను అవహేళన చేస్తూ ఆనందాన్ని పొందుతుంటారు. ఈ నేపథ్యంలో ఒక్కోసారి తమ కంటే శక్తిమంతులను కూడా శక్తి హీనులుగా తలంచి, వాళ్లని అవమానపరచడానికి ప్రయత్నించి చిక్కుల్లోపడిన వాళ్లు ఎంతోమంది వున్నారు.

ఇక తమపని తాము చూసుకుపోయే మంచివాళ్లను కదిలించి, వాళ్ల శాపానికి గురైన వాళ్లు కూడా చరిత్రలో ఎంతోమంది కనిపిస్తారు. అలా మహా పరాక్రమవంతుడైన రావణాసురుడు కూడా శాపానికి గురై ... దాని ఫలితాన్ని అనుభవించక తప్పలేదు. ఒకసారి రావణుడు విహారానికి వెళ్లి తిరిగి వస్తుండగా దారిలో ఆయనకి 'అష్టావక్రుడు' తారసపడతాడు. తల్లి గర్భంలో ఉండగానే శాపానికి గురైన ఆయన ఎనిమిది వంకరలతో జన్మిస్తాడు. అందువలన ఆయనని అంతా అష్టావక్రుడని పిలుస్తుంటారు.

ఆయన రూపాన్ని చూడగానే రావణాసురుడు పెద్దగా నవ్వుతాడు. అష్టావక్రుడి వీపుపై బలంగా కొట్టి, ఆయన వంకరాలను తాను చాలా తేలికగా సరిచేయగలనంటూ ఎద్దేవా చేస్తాడు. రావణుడి అహంభావం అష్టావక్రుడికి ఆగ్రహావేశాలను కలిగిస్తుంది. నిస్సహాయ స్థితిలో వున్న వారిని ఆటపట్టించడం ... అవమానపరచడం పరాక్రమవంతుల లక్షణం కాదని అష్టావక్రుడు అంటాడు. తన రూపాన్ని ఎగతాళి చేసినందుకు ఫలితంగా, యుద్ధంలో రావణాసురుడు పోల్చుకోవడానికి వీలులేనంతగా కోతులతో తొక్కబడతాడని శపిస్తాడు.

అయన మాటలను చాలా తేలికగా కొట్టిపారేస్తూ అక్కడి నుంచి అంతే ఉత్సాహంగా రావణుడు వెళ్లిపోతాడు. ఆ తరువాతే ఆయన సీతను అపహరించడం ... రాముడితో యుద్ధానికి దిగడం జరుగుతుంది. శ్రీరాముడి చేతిలో రావణుడు నేలకు ఒరగడంతో, ఆయన శరీరం పైకి వానరులు ఉత్సాహంగా ఎక్కి తొక్కుతారు. అలా రావణుడి విషయంలో అష్టావక్రుడి శాపం ఫలిస్తుంది. అందుకే ఎవరు ఎంతటి శక్తి హీనులైనా ... ఎలాంటి స్థితిలో వున్నా అలాంటివారిని అవమానపరచకూడదని ఈ సంఘటన మరోమారు స్పష్టం చేస్తోంది.

More Bhakti Articles