దేవతలు తల దాచుకున్న దివ్య క్షేత్రం

దేవతలు తల దాచుకున్న దివ్య క్షేత్రం
దానవులు దేవలోకంపై దండెత్తడం ... దేవతలు ఎక్కడో ఒకచోట కొంతకాలం పాటు తలదాచుకోవడం వంటి సంఘటనలు పురాణాల్లో కనిపిస్తూ వుంటాయి. ఈ నేపథ్యంలోనే హిరణ్యకశిపుడు కూడా దేవలోకంపై దండెత్తడానికి బయలుదేరుతాడు. తాము ఎక్కడ తల దాచుకున్నా అక్కడికి హిరణ్యకశిపుడు రావడం ఖాయమనే విషయం దేవతలకు అర్థమై పోతుంది. ఆయన బారి నుంచి తమని తాము కాపాడుకోవడం ఎలా అనే విషయంలో వాళ్లు తర్జనభర్జన పడతారు.

ఎవరికి ఏమీ పాలుపోకపోవడంతో 'కదంబ మహర్షి' ని ఆశ్రయిస్తారు. తమ పరిస్థితిని విన్నవించుకుని, తమని వెదుక్కుంటూ హిరణ్యకశిపుడు రాలేని ప్రదేశాన్ని చూపవలసినదిగా కోరతారు. అప్పుడు ఆ మహర్షి వారికి ఒక పవిత్రమైన ప్రదేశాన్ని చూపిస్తాడు. మహిమాన్వితమైన ఆ ప్రదేశంలోకి హిరణ్యకశిపుడు ప్రవేశించలేడని చెబుతాడు. దాంతో ఇంద్రాది దేవతలు తేలికగా ఊపిరి పీల్చుకుని కొంతకాలం పాటు ఆ ప్రదేశంలో ఉండిపోతారు. శ్రీమహావిష్ణువును పూజిస్తూ ఆయన అనుగ్రహంతో కాలం గడుపుతారు.

అత్యంత శక్తిమంతమైన ఆ ప్రదేశమే నేడు తమిళనాడు ప్రాంతంలోని 'తిరుక్కోట్టియూర్' గా అలరారుతోంది. ఇక్కడి స్వామివారు సౌమ్యనారాయణమూర్తి పేరుతోను ... అమ్మవారు తిరుమామగళ్ పేరుతోను పూజలు అందుకుంటున్నారు. దేవతలు నివసించిన కారణంగా ... దేవతలచే స్వామివారు పూజలందుకున్న కారణంగా ఈ క్షేత్రం మరింత విశిష్టతను కలిగివుంది. ఆసక్తికరమైన పురాణ నేపథ్యం గల క్షేత్రం కావడం వలన ... అనేకమంది రాజుల ఇలవేల్పుగా స్వామి ఉన్నందు వలన భక్తులు భారీ సంఖ్యలో ఇక్కడికి తరలివస్తుంటారు.

అడుగడుగునా భారీతనాన్ని సంతరించుకున్న ఆలయ నిర్మాణ నైపుణ్యాన్ని చూసితీరవలసిందే. రామానుజాచార్యులవారు మొట్టమొదటిసారిగా ఈ క్షేత్రంలోనే అష్టాక్షరీ మంత్రాన్ని ప్రజలకు వినిపించారు. ఎంతోమంది మహాభక్తులు ఇక్కడి స్వామివారిని దర్శించి ... సేవించి తరించారు. స్వామివారి దర్శనం వలన సకలశుభాలు చేకూరతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తిస్తుంటారు.

More Bhakti Articles