రాయలవారిని మంత్రించిన శ్రీకాకుళ క్షేత్రం

రాయలవారిని మంత్రించిన శ్రీకాకుళ క్షేత్రం
కృష్ణా నది ఒడ్డున వెలసిన పవిత్రమైన పుణ్య క్షేత్రాలలో 'శ్రీకాకుళ క్షేత్రం' ఒకటి. ఆంద్ర మహావిష్ణువు వెలసిన ఈ పుణ్య క్షేత్రం ఆధ్యాత్మిక పరంగాను ... చారిత్రకంగానూ విశిష్టమైన స్థానాన్ని ఆక్రమించిందని చెప్పొచ్చు. శ్రీకాకుళేశ్వరుడిని ఆంధ్రనాయకుడనీ ... ఆంధ్ర వల్లభుడని ... ఆంధ్ర మహావిష్ణువు అని పిలుస్తుంటారు. భూలోకంలో పాపభారాన్ని తగ్గించడం కోసం, దేవతల కోరిక మేరకు బ్రహ్మదేవుడు ఇక్కడ తపస్సు చేసినట్టుగా 'బ్రహ్మాండ పురాణం' చెబుతోంది. బ్రహ్మ తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన శ్రీ మహా విష్ణువు, ఆయన కోరిక మేరకు అక్కడే వెలసినట్టు తెలుస్తోంది. 'అగస్త్య మహర్షి' ఈ స్వామివారిని దర్శించుకున్నట్టుగా స్కాంద పురాణం చెబుతోంది. ఇక క్రీడాభిరామం ... వల్లాభాభ్యు దయం ... ఆంధ్రనాయక శతకం ... నారాయణ తీర్థుల వారి 'శ్రీ కృష్ణ లీలా తరంగిణి' మొదలైనవాటిలో ఈ క్షేత్ర ప్రస్తావన కనిపిస్తుంది.

క్రీ.పూ.నాలుగో శతాబ్దంలోనే స్వామివారి దేవాలయం ఇక్కడ వున్నట్టు చరిత్ర చెబుతోంది. అయితే ఏ కారణం చేతనో వెయ్యేళ్ళ పాటు గర్భాలయంలోని మూలమూర్తి అదృశ్యమైంది. కాలక్రమంలో ... ఒరిస్సా పాలకుడైన అంగ భూపాలుడి ప్రధాన మంత్రి నరసింహవర్మ,స్వామివారి విగ్రహం గురించి వెదుకుతుండగా, స్వామివారే ఆయనకి కలలో కనిపించి తన జాడ చెప్పారట. దాంతో ఆయనను తీసుకువచ్చి తిరిగి ప్రతిష్టించారు. శ్రీ కృష్ణదేవరాయలు తన రాజ్య విస్తరణలో భాగంగా ఇక్కడి స్వామివారిని దర్శించుకుని ఆయన సౌందర్యాన్ని చూసి ముగ్ధుడయ్యాడట. ఆ రాత్రి ఆ ఊళ్లోనే బసచేసిన ఆయనకి ... సాక్షాత్తు స్వామివారు కలలో కనిపించి ఆంధ్రకావ్యాన్ని రచించమని చెప్పిన కారణంగానే తాను 'ఆముక్త మాల్యద' రచించినట్టు శ్రీకృష్ణదేవరాయలు చెప్పుకున్నారు. ఇందుకు గుర్తుగా ఇప్పటికి అక్కడి 16 కాళ్ల మంటపంలో శ్రీ కృష్ణ దేవరాయల విగ్రహం కనిపిస్తుంది.

శ్రీ రాజ్యలక్ష్మీ సమేతుడైన శ్రీకాకుళేశ్వర స్వామికి ప్రతి యేటా వైశాఖమాసంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతుంటాయి. ఇక 'వైకుంఠ ఏకాదశి' రోజున ఇక్కడి స్వామివారిని 'ఉత్తర ద్వారా దర్శనం' చేసుకుంటే పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

More Bhakti Articles