ఆయురారోగ్యాలను ప్రసాదించే సూర్య క్షేత్రం

ఆయురారోగ్యాలను ప్రసాదించే సూర్య క్షేత్రం
వేద వేదాలను అభ్యసించిన మహర్షులు సూర్యుడిని ప్రత్యక్ష నారాయణుడిగా భావించి పూజించారు. అక్షర జ్ఞానంలేని కొండజాతి ప్రజలు సైతం సూర్యుడిని కనిపించే దైవంగా విశ్వసించి ఆరాధించారు. అలా పండిత పామరులచే ఆరాధించబడిన సూర్యభగవానుడు ... ఒక్క నమస్కారంతోనే ఆయురారోగ్యాలను ప్రసాదించే దైవంగా అలరారుతున్నాడు.

ప్రస్తుతం మనం పూజిస్తోన్న సూర్యుడి పేరు 'వివస్వాన్' ... ఈ కారణంగానే ఈ మన్వంతరానికి 'వైవస్వత మన్వంతరం' అనే పేరు వచ్చింది. వైవస్వత మన్వంతరం కూడా రథసప్తమి రోజునే ఆరంభమైంది. సమస్త జీవులకు ఆధారమై ... నిరంతర శక్తితో అవి పయనించే చైతన్యాన్ని ప్రసాదిస్తాడు కనుకనే, దేవతలు ... మహర్షులు ... మహారాజులు సూర్యభగవానుడి ఆలయాల ఆవిర్భవానికి తమవంతు కృషి చేశారు. ఫలితంగా అనేక ప్రాంతాల్లో సూర్య దేవాలయాలు విశిష్టతను సంతరించుకుని విలసిల్లుతున్నాయి.

ఈ నేపథ్యంలో 'నంది కొట్కూరు' లోని సూర్యదేవాలయం ఇటు పురాణ పరమైన అటు చారిత్రక పరమైన ప్రాధాన్యతను సంతరించుకుని వెలుగొందుతోంది. సాక్షాత్తు సూర్య భగవానుడి ఆదేశం మేరకే ఈ ఆలయాన్ని చోళరాజు నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. నింగిలోని సూర్యుడిని నేరుగా చూడలేం ... కాని ఇక్కడి గర్భాలయంలోని సూర్యనారాయణమూర్తిని కనులారా తిలకిస్తూ మనసారా తరించవచ్చు.

'రథ సప్తమి' రోజున ఇక్కడి ఆలయాన్ని భక్తులు విశేష సంఖ్యలో దర్శించుకుంటారు. రథ సప్తమి రోజున సూర్య దేవుడిని పూజించడం వలన అప్పుల బాధలు ... శత్రు భయాలు తొలగిపోతాయనీ, సుదీర్ఘ వ్యాధులు నశిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. సమస్త మానవాళి జీవితాలను ఆధ్యాత్మిక పరంగాను ... ఆరోగ్య పరంగాను ప్రభావితం చేస్తోన్న సూర్యభగవానుడిని ఒక్క రథసప్తమి రోజునే కాదు ... అనునిత్యం పూజించాలి ... అనుక్షణం ఆరాధించాలి.

More Bhakti Articles