తలపై కణితిని మాయం చేసిన స్వామి

 తలపై కణితిని మాయం చేసిన స్వామి
అక్కల్ కోట స్వామి మహిమాన్వితుడనీ ... ఆయన అనుగ్రహాన్ని కోరుతూ ఎంతోమంది సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారనే విషయం పేదవాడైన ఓ వ్యక్తికి తెలుస్తుంది. స్వామి దర్శనం చేసుకుని ఆర్ధికపరమైన ... ఆరోగ్యపరమైన సమస్యల నుంచి బయటపడుతున్న వాళ్లు ఎందరో వున్నారు. అలాంటి స్వామికి తన సమస్యను కూడా చెప్పుకోవడం మంచిదని అతను భావిస్తాడు.

చాలాకాలం నుంచి తలపై కణితితో అతను చాలా ఇబ్బంది పడుతున్నాడు. మొదట్లో చిన్నదిగా వున్న ఆ కణితి, రాన్రాను పెద్దది కాసాగింది. తలపై కణితి చిత్రంగా కనిపిస్తూ ఉండటంతో, అందరూ అతనిని విచిత్రంగా చూసేవారు. కొందరు ఎద్దేవా కూడా చేసేవారు. తన ముఖాన్ని అద్దంలో చూసుకోవడానికి ... బయటికి వెళ్లడానికి కూడా అతను భయపడే పరిస్థితి వస్తుంది. ఆపరేషన్ ద్వారా ఆ కణితిని తొలగించుకునే ఆర్ధిక పరిస్థితి లేకపోవడం వలన, అక్కల్ కోట స్వామిని దర్శించడమే మార్గమని అతను భావిస్తాడు.

తన దగ్గరున్న కాస్త డబ్బుతో స్వామివారికి పండ్లు తీసుకుని ఆయన ఆశ్రమానికి చేరుకుంటాడు. అక్కల్ కోట స్వామితో పాటుగా అక్కడున్న వాళ్లంతా ఆయన తలపై గల కణితిని చూసి పెద్దగా నవ్వేస్తారు. దాంతో తన సమస్య అదేనని చెప్పుకోకుండా స్వామివారికి పండ్లు సమర్పించుకుని ఆ వ్యక్తి తన ఇంటికి చేరుకుంటాడు. అందరితో పాటు స్వామి కూడా నవ్వడం అతనికి మరింత బాధ కలిగిస్తుంది. ఇక బతికున్నంత కాలం ఇలా అవమానాలు భరిస్తూ వుండవలసిందేనని బాధపడుతూ నిద్రలోకి జారుకుంటాడు.

ఆ రాత్రి అతనికి కలలో స్వామి దర్శనమిస్తాడు. తాను కావాలనే అలా నవ్వాననీ ... దాని గురించి బాధపడొద్దని అంటాడు. తనని నమ్మిన వారిని నవ్వులపాలు కానివ్వనంటూ అతని తలపై గల కణితిని చేతితో నిమురుతాడు. క్షణాల్లో ఆ కణితి కరిగిపోతున్నట్టుగా అనిపించడంతో ఆ వ్యక్తికి మెలకువ వస్తుంది.

అదంతా కలే గదా అనుకుంటూ నిరాశతో కణితిని తడుముకోబోయాడు. అక్కడ కణితి లేకపోవడంతో ఆశ్చర్యపోతాడు. కణితి ఆనవాలు కూడా లేకుండా పోవడంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరౌతడు. మరునాడు అక్కల్ కోట స్వామి సన్నిధికి చేరుకొని కృతజ్ఞతా పూర్వకంగా సాష్టాంగ నమస్కారం చేస్తాడు. చిరునవ్వులు చిందిస్తూనే స్వామి అతణ్ణి ఆశీర్వదిస్తాడు.

More Bhakti Articles