అతిథిని ఆకలితో వెళ్లనీయకూడదా ?

అతిథిని ఆకలితో వెళ్లనీయకూడదా ?
అతిథి దేవోభవ అనే మాటను మనం తరచూ వింటూనే వుంటాం. అతిథిని దైవంగా భావించి సేవించాలని పురాణాలు చెబుతున్నాయి. పూర్వకాలంలో మహర్షుల నుంచి సాధారణ ప్రజల వరకూ అతిథి లేకుండా ఏ పూటకూడా భోజనం చేసేవారు కాదు. తమ ఇంటికి అతిథి రాని రోజున ఊళ్లోకి వెళ్లి ఆకలితో వున్న ఎవరినో ఒకరిని వెతికి తీసుకువచ్చి మరీ భోజనం పెట్టేవాళ్లు.

అతిథికి అర్పించకుండా భోజనం చేయకూడదనే నియమాన్ని అప్పట్లో అందరూ పాటించే వాళ్లు. భోజన సమయంలో దేవతలు తమ భక్తులను పరీక్షించడానికి అతిథుల రూపంలో వస్తుంటారనే విశ్వాసం కూడా ఇందుకు కారణమైంది. పోతన భోజనానికి కూర్చున్న సమయంలో శ్రీరామచంద్రుడు మారువేషంలో అతిథిగా వస్తాడు. అప్పుడు పోతన తాను పస్తులు వుండి ఆ భోజనాన్ని అతిథికి వడ్డిస్తాడు. ఫలితంగా ఆయన శ్రీరామచంద్రుడి అనుగ్రహాన్ని పొందడాన్ని ఇక్కడ మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

భోజన సమయంలో ఆకలితో వచ్చిన అతిథిని మర్యాద పూర్వకంగా ఆహ్వానించి సంతృప్తికరంగా భోజనంపెట్టి పంపించాలి. అప్పుడు అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి. ఆకలితో వచ్చిన అతిథిని పట్టించుకోకుండా భోజనం చేసిన వారికి నరకలోకప్రాప్తి కలుగుతుంది. ఆకలితో తిరిగివెళ్ళే అతిథి ఆ కుటుంబీకుల పుణ్యఫలాలను తీసుకెళ్లిపోతాడని శాస్త్రం చెబుతోంది. అందువలన అతిథిని ఆప్యాయంగా ఆహ్వానించాలి ... ఆదరించాలి ... రుచికరమైన వంటకాలతో సంతృప్తి పరచాలి. అప్పుడే ఆర్జించిన పుణ్యం స్థిరంగా వుంటుంది ... అతిథిని సేవించిన పుణ్యం అనంతమవుతుంది.

More Bhakti Articles