ఫలించిన వెంగమాంబ శాపం

ఫలించిన వెంగమాంబ శాపం
తిరుమల కొండలపై తుంబురు తీర్థం సమీపంలో గల గుహలో తరిగొండ వెంగమాంబ స్వామివారిని గురించిన ధ్యానం చేస్తూ వుండేది. ఒక రోజున ధ్యానంలో వున్న ఆమెకి దూరం నుంచి ఆర్తనాదం వినిపిస్తుంది. దాంతో ఆమె గుహ బయటికి వచ్చి చూస్తుంది. కుష్ఠు వ్యాధిగ్రస్తుడైన ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, అందుకు కూడా శరీరం సహకరించకపోవడంతో తనని తీసుకెళ్లి పొమ్మంటూ వేంకటేశ్వరుడిని వేడుకుంటూ వుంటాడు.

వెంగమాంబ ఆయన్ని సమీపించి ముందుగా గాయాల వలన కలుగుతోన్న బాధకు ఉపశమనం కలిగిస్తుంది. ఆ తరువాత ఆకలి దప్పులు తీర్చి .. విషయమేమిటని అడుగుతుంది. కుష్ఠువ్యాధి కారణంగా తనకి భార్యా బిడ్డలు దూరమయ్యారనీ ... పలకరించే వారుగానీ ... పట్టించుకునే వారుగాని లేరంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందుగా స్వామి దర్శనం కోసం వచ్చాననీ, వ్యాధి కారణంగా తనని అనుమతించలేదని చెబుతాడు. అందువల్ల తనువు చాలించాలనే ఉద్దేశంతో అటుగా వచ్చానని అంటాడు.

ఆ దీనుడి పాపాలను ప్రక్షాళన చేయమని స్వామివారిని వెంగమాంబ కోరడమే ఆలస్యం ఆ వ్యక్తి వ్యాధి మటుమాయమవుతుంది. ఆమె పాదాలపై పడి ఆ వ్యక్తి కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. తుంబురు కోనలో తనని చూసినట్టుగా కానీ, తన వలన వ్యాధి నయమైందని గాని ఎవరికీ చెప్పవద్దనీ, చెప్పిన మరుక్షణమే మరణం సంభవిస్తుందని వెంగమాంబ అంటుంది. అలాగే నంటూ ఆ వ్యక్తి అక్కడి నుంచి తిరుమలకు చేరుకుంటాడు.

అంతకు ముందు వరకూ కుష్ఠు వ్యాధితో బాధపడిన అతను ఆనందంగా ... ఆరోగ్యంగా వుండటం కొందరు గమనిస్తారు. ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ... ఆ రహస్యమేమిటో చెప్పమని ఒత్తిడి చేస్తారు. మొదట్లో భయపడి చెప్పకుండా తప్పించుకున్నా, ఆ తరువాత ధైర్యం తెచ్చుకుని అసలు సంగతి చెప్పేస్తాడు. అంతే ఆ క్షణమే ... అక్కడికక్కడే ఆ వ్యక్తి మరణిస్తాడు. ఈ సంఘటనతో తరిగొండ వెంగమాంబ మహిమ మరోసారి వెలుగులోకి వస్తుంది.

More Bhakti Articles