లోహంతో దాహం తీర్చుకున్న స్వామి

 లోహంతో దాహం తీర్చుకున్న స్వామి
శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారు వివిధ ప్రాంతాలను దర్శిస్తూ ... కాలజ్ఞానాన్ని వివరిస్తూ తన శిష్యులతో కలిసి ముందుకు సాగుతున్నాడు. ఈ ప్రయాణంలో భాగంగా ఆయన ఒకరోజు నంద్యాల సమీపంలో గల ఒక గ్రామానికి చేరుకుంటాడు. చాలా దూరం నుంచి ప్రయాణం చేస్తూ రావడం వలన బ్రహ్మంగారికి దాహం వేస్తుంది. ఆయన ఓ ఇంటిముందు నుంచుని మంచినీళ్లు తీసుకురమ్మని తన శిష్యుడిని పంపిస్తాడు.

ఆ ఇంటి యజమాని లోహ సంబంధిత వృత్తిని నిర్వహిస్తూ వుంటాడు. ఆయన లోహాన్ని కరిగిస్తూ వుండగా, బ్రహ్మంగారి శిష్యుడు అక్కడికి వస్తాడు. తన గురువుకి దాహంగా ఉందనీ, మంచినీరు ఇవ్వమని ఆ శిష్యుడు కోరతాడు. గురువు ఎవరా అన్నట్టుగా ఆ వ్యక్తి దూరంగా నుంచున్న బ్రహ్మంగారిని చూస్తాడు. కాషాయ వస్త్రాలు ధరించిన వాళ్లంతా గురువులు కారనీ, అలాంటి వాళ్లని తాను నమ్మనని ఎద్దేవా చేస్తాడు.

తన గురువు సామాన్యుడు కాడనీ ... ఆయన గురించి అలా మాట్లాడటం మంచిది కాదని చెబుతాడు శిష్యుడు. అయినా అది ఆయన గొప్పతనం గురించి మాట్లాడుకునే సమయం కాదనీ, ముందుగా ఆయన దాహం తీరడానికి మంచినీరు ఇవ్వమని అడుగుతాడు. ఆయన గురువు అంతటి మహిమగలవాడే అయితే మంచినీళ్ల కోసం ఎదురుచూస్తూ కూర్చోకూడదనీ, మరుగుతోన్న లోహాన్ని మంచినీళ్లుగా తాగవచ్చునంటూ తన చేతిలోని లోహపాత్రను పిట్టగోడపై పెడతాడు.

తన శిష్యుడికి ... ఆ ఇంటి యజమానికి ఏదో వాదన జరుగుతోందని గ్రహించిన బ్రహ్మంగారు అక్కడికి వస్తాడు. క్షణకాలంలో ఆయనకి విషయం అర్థమైపోతుంది. పాత్రలో మరుగుతోన్న లోహాన్ని ఆయన గటగటమంటూ తాగేస్తాడు. ఆ దృశ్యం చూసిన ఆ ఇంటి యజమాని బిత్తరపోతాడు. వేసవి తాపానికి తట్టుకోలేక దాహం అడిగితే చాలా చక్కగా తీర్చావని ఆ ఇంటి యజమానితో అంటాడు.

తన తొందరపాటును మన్నించమంటూ ఆ వ్యక్తి స్వామి పాదాలపై పడతాడు. సాయం చేసే ఉద్దేశం లేనప్పుడు తీరికలేదని చెప్పవచ్చనీ, అవమానించే ప్రయత్నం మాత్రం చేయకూడదని హితవు చెప్పి బ్రహ్మంగారు అక్కడి నుంచి ముందుకు సాగుతాడు.

More Bhakti Articles