అంతుచిక్కని శిరిడీ సాయి మహిమ

అంతుచిక్కని  శిరిడీ సాయి మహిమ
శిరిడీ సాయిబాబా జీవితాన్ని పరిశీలించి చూస్తే ఆయన ప్రతి కదలిక అపూర్వం ... అద్భుతం ... మహిమాన్వితం అనిపిస్తుంది. కావాలని ఆయన ఎప్పుడూ మాయలు ... గారడీలు చెయ్యలేదు. తన పనులు తాను చేసుకుపోవడంలోనే ఎన్నో మహిమలు బహిర్గతమయ్యేవి. అలాంటి వాటిలో సాయిబాబా కొయ్యబల్లపై నిద్రించిన వైనం ఒకటిగా కనిపిస్తుంది. మశీదులో బాబా కిందపడుకోవడం చూడలేక 'నానాసాహెబ్ డేంగలే' ఒక కొయ్యబల్లను ఇచ్చాడు.

అది నాలుగు అడుగుల పొడవును ... చాలా తక్కువ వెడల్పును కలిగి వుండేది. బాబా ఆ చెక్క బల్లాను కిందవేసుకోకుండా దానికి నాలుగు మూలలా నాలుగు గుడ్డ పేలికలు కట్టి మశీదులో ఉయ్యాలలా వేలాడదీశాడు. బాబా కాస్త ఎగిరి ఆచెక్క బల్లను ఎక్కవలసి వుంటుంది. ప్రతిరోజు రాత్రి బాబా ఆ చెక్క బల్లాపై నాలుగు మూలల్లోను నాలుగు దీపాలు వెలిగించి వాటి మధ్యలో ఆయన పడుకునే వాడు.

అసలే అది చాలా సన్నగా వున్న బల్ల ... దానికి బాబా చిరిగిన గుడ్డ పేలికలు కట్టడం ... దానిపై పడుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆజానుబాహుడైన బాబా ... నాలుగు అడుగుల చెక్కబల్లా పై హాయిగా పడుకోవడం ... పైగా ఆ బల్లా నాలుగు మూలలా నాలుగు దీపాలు వెలిగించి పెట్టడం ఒక విచిత్రంగా అనిపించింది. అసలు ఆ చెక్క బల్లాను కూడా మోయలేని గుడ్డపేలికలు ఆయన బరువును ఎలా ఆపగాలుగుతున్నాయో వాళ్లకి అర్థం కాలేదు.

బాబా ఆ బల్లాపై పడుకోగా చూసిన వాళ్లే గానీ, ఆయన ఆ బల్లాను ఎక్కుతుండగా చూసిన వాళ్లు లేరు. ఇందులో ఏదో మాయ ఉందనీ ... అదేమిటో తెలుసుకోవాలని కొందరు అనుకున్నారు. బాబా ఆ చెక్క బల్లాపైకి ఎక్కడం చూడాలని రహస్యంగా ఓ గోడ పక్కన దాక్కున్నారు. చిత్రమైన ఆ ఘట్టం కోసం ఎదురు చూసి చూసి వాళ్లకి నిద్రముంచుకు వచ్చేది. వెంటనే వాళ్లు కళ్ళు నలుపుకుని చూసే సరికే బాబా ఆ బల్లాపై విష్ణుమూర్తి లా పడుకుని కనిపించే వాడు.

అలా ఎన్ని రోజులపాటు ఎంతమంది ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోతుంది. ఈ రహస్యాన్ని ఎలాగైనా తెలుసుకోవాలనే ఆసక్తి జనంలో ఎక్కువ కాసాగింది. రాత్రి సమయంలో మశీదు చుట్టుపక్కల చేరే వారి సంఖ్య ఎక్కువ కాసాగింది. ఇది గమనించిన బాబా ... ఆ చెక్క బల్లాను విరిచి అవతల పడేశాడు. దాంతో ఆయన లీలా విశేషాన్ని ఎవరూ ప్రత్యక్షంగా చూడలేకపోయారు.

More Bhakti Articles