శివదీక్షా ఫలితం

శివదీక్షా ఫలితం
జీవితం సమస్యల సుడిగుండంలా కనిపిస్తూ వుంటుంది. ఆ సుడిగుండాలను దాటుకుంటూ ఆనందమనే తీరానికి చేరుకోవడానికి అందరూ అహర్నిశలూ ప్రయత్నిస్తూ వుంటారు. ఈ సమయంలోనే తనకి సాయంగా వుండమంటూ భగవంతుడిని కోరుతూ వుంటారు. ఆయన అనుగ్రహాన్ని పొందడానికి మాలధారణ చేసి మండలదీక్ష చేపడుతూ వుంటారు. సాధారణంగా వేంకటేశ్వరస్వామి దీక్ష ... అయ్యప్ప దీక్ష ... హనుమాన్ దీక్ష ... భవానీ దీక్ష ... శివ దీక్ష తీసుకునే వాళ్లు ఎక్కువగా కనిపిస్తుంటారు.

వేంకటేశ్వరస్వామి దీక్షను ధరించిన వారు పసుపు రంగు వస్త్రాలు ... అయ్యప్ప దీక్షా ధారులు నలుపురంగు వస్త్రాలు ... హనుమాన్ దీక్షా ధారులు సిందూరం రంగు వస్త్రాలు ... భవానీ దీక్షా ధారులు ఎరుపురంగు వస్త్రాలు .. శివ దీక్షా పరులు నీలం రంగు దుస్తులు ధరిస్తూ వుంటారు. వస్త్రం వర్ణం ఏదైనా తాము దీక్షలో వున్నామనే విషయాన్ని గుర్తుచేయడానికి అది ఉపయోగపడుతూ వుంటుంది.

ఇక ఈ మండల దీక్షలు తీసుకోవడం ఎవరు ఎప్పుడు ప్రారంభించారనేది తెలుసుకోవడం కొంత కష్టతరమైన పనే. శివ దీక్ష విషయానికి వస్తే ... ఈ దీక్షను మొదటిసారిగా క్రీ.శ.7 వ శతాబ్దంలో బాదామీ చాళుక్య రాజైనటువంటి విక్రమాదిత్యుడు స్వీకరించినట్టు ఆనాటి శాసనాలు చెబుతున్నాయి. మండలం పాటు శివ దీక్షను చేపట్టిన ఆయనకి విశేషమైన ఫలితాలు కనిపించాయట. ఆయన ప్రాచుర్యం కల్పించిన నాటి నుంచే శివదీక్షకు ఆదరణ పెరిగిందని అంటారు.

కార్తీక మాసం శివుడికి ప్రీతికరమైన మాసం గనుక, ఆ మాసంలో ఆయన దీక్షధారణ చేస్తూ వస్తున్నారు. శివ దీక్షను చేపట్టిన వారు సమస్త పాపాల నుంచి విముక్తి పొందుతారు. వ్యాధులు ... రుణాల బాధల నుంచి బయటపడతారు. దారిద్ర్యానికి ... దుఃఖానికి దూరమై సంతోషాలను పొందుతారు. అంకితభావంతో ఆశించిన వాళ్లు మోక్షానికి అవసరమైన అర్హతను సంపాదించుకుంటారని, పదే పదే ఆదిదేవుడి దీక్షను తీసుకుంటోన్న భక్తులు అనుభవ పూర్వకంగా చెబుతుంటారు.

More Bhakti Articles