శిల నుంచి పుట్టిన శ్రీనివాసుడు

శిల నుంచి పుట్టిన శ్రీనివాసుడు
శ్రీనివాసుడు తన భక్తులను అనుగ్రహించడం కోసం అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించాడు. ఒక్కో ప్రదేశంలో ఒక్కో లీలను ఆవిష్కరిస్తూ, తాను కొలువైన ప్రతి క్షేత్రం మహిమాన్వితమైనదేనని తన భక్తులకు చాటిచెబుతున్నాడు. అలా అశేష భక్త జనులను ఆకర్షిస్తోన్న క్షేత్రంగా రంగారెడ్డి జిల్లా 'చేవెళ్ల' దర్శనమిస్తుంది. ఇక్కడి గుట్టపై గల శ్రీనివాసుడిని దర్శిస్తే, స్థలపురాణంగా ఆయన మహిమలు ఒక్కొక్కటిగా తెలుస్తాయి.

క్రీ.శ.13 వ శతాబ్దంలో ఓ భక్తుడు ఇక్కడ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించాడు. ఆ తరువాత చాలాకాలంపాటు స్వామివారికి నిత్య ధూప .. దీప .. నైవేద్యాలు జరుగుతూ వచ్చాయి. కాలక్రమంలో ఆలయం శిధిలావస్థకు చేరుకోగా మరో భక్తుడు ఆలయాన్ని పునఃనిర్మించాడు. ఈ నేపథ్యంలోనే ఓ అద్భుతం జరిగింది.

ఓ రైతు పొలాన్ని దున్నుతూ బరువు కోసం ఆ పొలం గట్టునే వున్న ఓ రాయిని నాగలిపై ఉంచాడు. అలా పొద్దు పోయేవరకూ పొలాన్ని కొంత వరకు దున్ని ఆ నాగలిని .. రాయిని అలాగే వదిలి ఇంటికి వెళ్లాడు. మరునాడు ఉదయం తిరిగి పొలం దగ్గరికి వచ్చిన ఆయనకి , ఆ బండరాయి నాగలి దగ్గర కాకుండా పొలం గట్టుపై యథాస్థానంలో కనిపించింది. ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తూనే ఆ రాయిని తెచ్చి మళ్ళీ నాగలి పై పెట్టాడు.

ఈ సారి వెంటనే రాయి దానంతట అది జరుగుతూ వెళ్లి పొలం గట్టుపై యథాస్థానంలో నిలిచింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు అది దైవ మహిమగా భావించి అక్కడికి తరలి వచ్చి పెద్ద సంఖ్యలో కొబ్బరికాయలు కొట్టారు. అయితే ఆ శిలను ఏ దైవంగా భావించాలనేది వాళ్లకు అర్థం కాలేదు. ఆ శిల తన సాలగ్రామ రూపమనీ, తనని ఆ పొలం గట్టుపై నుంచి తీసుకువెళ్లి ఆ ఊళ్లోని ఆలయంలో ప్రతిష్ఠించమని ఆ రాత్రి వేంకటేశ్వరస్వామి వారు పూజారి కలలో చెప్పాడు.

మరునాడు ఉదయం తనకి వచ్చిన కలను గురించి ఆయన గ్రామస్తులకు తెలియ జెప్పడంతో అందరికీ ఓ స్పష్టత వచ్చింది. అందరూ కలిసి శిలా రూపంలో వున్నశ్రీ వేంకటేశ్వరస్వామిని ఆలయంలో ప్రతిష్ఠించారు. ఈ సంఘటన కారణంగా ఇది మహిమాన్వితమైన క్షేత్రంగా ప్రసిద్ధిచెంది, నిత్యం భక్త జనులతో విలసిల్లుతోంది.

More Bhakti Articles