ఫలించిన పూర్వజన్మ పుణ్యం

ఫలించిన పూర్వజన్మ పుణ్యం
శ్రీ రాఘవేంద్రస్వామి వారు శిష్యులతో కలిసి అనేక ప్రాంతాలను దర్శిస్తూ ఓ గ్రామానికి చేరుకుంటాడు. శిష్యులతో కలిసి ఆ గ్రామ వీధిలో ఆయన నడచి వెడుతుండగా ఓ వ్యక్తి తారసపడతాడు. వికారంగా దుర్భరమైన పరిస్థితిలో వున్న ఆ వ్యక్తిని చూస్తూ రాఘవేంద్ర స్వామి కొంతసేపు అక్కడ ఆగుతాడు. ఆయనని చూడగానే ఆ వ్యక్తికి కూడా ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. ఆ వ్యక్తిని రాఘవేంద్రస్వామి అంత పరిశీలనగా చూడటం శిష్యులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

భారమైన మనసుతో రాఘవేంద్రస్వామి తనకి ఏర్పాటు చేయబడిన బసకు చేరుకుంటాడు. తనకి తారసపడిన వ్యక్తి గురించే స్వామి ఆలోచిస్తుంటాడు. పూర్వజన్మలో రాఘవేద్ర స్వామి వ్యాసరాయలుగా వున్నప్పుడు ఆ వ్యక్తి ఓ సంగీత విద్వాంసుడుగా జీవించాడు. అప్పట్లో ఆ వ్యక్తి వ్యాసరాయల వారిని స్తుతిస్తూ ఎన్నో కీర్తనలను ఆలపించాడు. ఆయన గాన మాధుర్యానికి వ్యాసరాయల వారు పరవశించిపోయిన సందర్భాలు ఎన్నో వున్నాయి. అలాంటి సంగీత విద్వాంసుడు ఏ శాపం కారణంగానో ఈ జన్మలో ఈ స్థితిని అనుభవిస్తున్నాడని స్వామి అనుకుంటాడు.

ఈ సమయమలోనే ఆ వ్యక్తిని పూర్వ జన్మ వాసన రాఘవేంద్రస్వామి చెంతకు నడిపిస్తుంది. అయితే ఆ వ్యక్తికి గత జన్మకి సంబంధించిన విషయం జ్ఞాపకం వుండదు. రాఘవేంద్ర స్వామి ఎదురుగా కూర్చుని ఆ వ్యక్తి దీనాతి దీనంగా నమస్కరిస్తాడు. ఆ వ్యక్తిని స్వామి ఆప్యాయంగా పలకరిస్తాడు ... ఆయన పరిస్థితిని గురించి అడిగి తెలుసుకుంటాడు. ఏ జన్మలో చేసిన పాపఫలితంగానో తాను అందరితో అవమానాలను ఎదుర్కుంటున్నాననీ ... తన జీవితంపై తనకి విరక్తి కలుగుతుందని ఆ వ్యక్తి చెబుతాడు. తనకి విముక్తి లభిస్తుందనే ఆశతో స్వామి దగ్గరికి వచ్చినట్టు చెబుతాడు.

పూర్వ జన్మలో చేసిన అసమానమైన సేవకు గాను ఆ వ్యక్తికి స్వర్గ ప్రాప్తిని కలిగించాలని స్వామి నిర్ణయించుకుంటాడు. ఆయనని అనుగ్రహిస్తున్నట్టు చెబుతూ స్వామి తన కమండలంలోని నీటిని ఆయనపై చల్లుతాడు. ఆ క్షణమే ఆ వ్యక్తి తన స్థూల శరీరాన్ని విడిచి సూక్ష్మ శరీరంతో స్వర్గం దిశగా సాగిపోతాడు. అలా స్వామి పూర్వ జన్మలో తనకి సేవలు చేసిన వారిని సైతం అనుగ్రహిస్తూ వారికి మోక్షాన్ని ప్రసాదించాడు.

More Bhakti Articles