అలిపిరికి దిగివచ్చిన అలమేలు మంగపతి

అలిపిరికి దిగివచ్చిన అలమేలు మంగపతి
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి కైంకర్యలను 'తిరుమల నంబి' అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూ ఉండేవాడు. శ్రీవారికి అభిషేక జలాలు తీసుకురావడం ... ఆయనని వివిధ రకాల పుష్పాలతో అలంకరించడం ఎంతో ఇష్టంగా చేసేవాడు. స్వామివారి సేవలోనే ఆయన సంతోషాన్ని ... సంతృప్తిని పొందేవాడు. మహా భక్తుడు అంతకు మించిన పండితుడు అయిన ఆయన్ని ఓ రోజున రామానుజాచార్యుల వారు కలుసుకుంటాడు. తనకి రామాయణంలోని గొప్పతనాన్ని తెలియజేయవలసిందిగా కోరతాడు.

స్వయానా మేనల్లుడు కావడంతో తిరుమల నంబి అందుకు అంగీకరిస్తాడు. ఉదయం వేళకి సంబంధించిన శ్రీవారి సేవలను ముగించి మధ్యాహ్నానికి ఆయన 'అలిపిరి' దగ్గరికి చేరుకునేవాడు. ఈ లోగా రామానుజాచార్యుల వారు గోవిందరాజ స్వామివారి దర్శనం చేసుకుని అలిపిరికి వచ్చేవాడు. రామాయణానికి సంబంధించిన విశేషాలను రామానుజాచార్యుల వారికి తిరుమల నంబి వివరించి, సాయంత్రానికి తిరిగి తిరుమల చేరుకునేవాడు.

రామానుజాచార్యుల వారికి పాఠాలు చెబుతోన్న కారణంగా మధ్యాహ్న సమయంలో శ్రీవారి పాదాలను సేవించుకోలేక పోతున్నందుకు తిరుమల నంబి బాధపడసాగాడు. ఈ విషయాన్ని గురించే ఆలోచిస్తూ ఓ రోజున ఆయన స్వామివారికి సేవలు చేయసాగాడు. ఈ విషయాన్ని గురించి చింతించవద్దనీ ... తన పాద దర్శనం ఆయనకి అలిపిరిలోనే కలిగేలా చేస్తాననే శ్రీవారి మాటలు తిరుమల నంబికి వినిపించాయి.

ఆయన సంతోషంతో పొంగిపోతూ పూజా కార్యక్రమం పూర్తి చేసి అలిపిరికి చేరుకున్నాడు. సమయానికి రామానుజాచార్యులు కూడా అక్కడికి వచ్చాడు. స్వామివారి మాటలను రామానుజాచార్యులుకి తిరుమల నంబి చెబుతూ ఉండగానే ఆ ప్రదేశంలో 'శ్రీవారి పాద ముద్రలు' ఆవిర్భవించాయి. మధ్యాహ్నం సమయంలో తాను దర్శించేందుకు వీలుగా స్వామివారే అలిపిరికి దిగిరావడం తిరుమల నంబిని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి చేసింది.

గురుశిష్యులు ఇద్దరూ కూడా స్వామివారి పాదాలను సాష్టాంగ నమస్కారం చేశారు. ఆనాటి నుంచి భక్తులంతా ఇక్కడి శ్రీవారి పాదాలను దర్శించి తరిస్తుంటారు. భక్తులతో స్వామివారు ఎంతటి విడదీయరాని అనుబంధాన్ని కలిగి ఉంటాడనేది ఈ సంఘటన మరోమారు చాటి చెప్పింది.

More Bhakti Articles