దోషం లేని పూజకే ఫలితం వుంటుంది

దోషం లేని పూజకే ఫలితం వుంటుంది
జీవితం సుఖ దుఖాల కలయిక అనే విషయం అందరికీ తెలిసినా, సుఖాలను ఆస్వాదించినంతగా కష్టాలను ఆహ్వానించలేరు. సుఖాలను ప్రసాదించిన దైవానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, తట్టుకోలేని కష్టాలను మాత్రం కలిగించవద్దని కొందరు కోరుతుంటారు. ఇక జీవితమన్నాక ఒడిదుడుకులు సహజం కనుక వాటిని ఎదుర్కునే శక్తిని ప్రసాదించమని మరికొందరు కోరుకుంటారు.

దైవాన్ని ఎవరు ఏది కోరాలన్నా ముందుగా ఆయనని పూజించాలి ... భక్తి శ్రద్ధలతో మెప్పించాలి. సాధారణంగా ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వారిని మర్యాద పూర్వకంగా చూడకపోతే వాళ్లు మరోమారు రారని జాగ్రత్తగా వ్యవహరించడం జరుగుతుంది. అలాగే భగవంతుడి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండవలసి వుంటుంది. భగవంతుడి మనసు గెలుచుకోవాలంటే ఆయనని 16 రకాల ఉపచారాలతో సేవించాలని శాస్త్రం చెబుతోంది.

ఆవాహనం .. ఆసనం .. పాద్యము .. అర్ఘ్యము .. ఆచమనీయం .. స్నానం .. వస్త్రం .. యజ్ఞోపవీతం .. గంధం .. పుష్పం .. ధూపం .. దీపం .. నైవేద్యం .. తాంబూలం .. నమస్కారం .. ప్రదక్షిణం షోడశోపచారాలుగా చెప్పబడుతున్నాయి. పూజకి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకుని మంత్రపూర్వకంగా స్వామిని ఆవాహన చేయడం జరుగుతుంది. ఆహ్వానాన్ని మన్నించి స్వామి వచ్చినట్టుగా భావన చేసుకుని మర్యాద పూర్వకంగా ఆయనకి అందించ వలసినవి అందించాలి ... సమర్పించవలసినవి సమర్పించాలి.

ఆ తరువాత స్వామికి కృతజ్ఞతా పూర్వకంగా నమస్కరించి, తన వలన ఎలాంటి పొరపాట్లు జరిగినా మన్నించమంటూ ప్రదక్షిణ చేయాలి. దైవాన్ని పదహారు రకాల ఉపచారాలతో సేవించాలనే నియమం చేయబడింది. అందువలన పూజలో ఏ ఉపచారం లోపించినా అందుకు సంబంధించిన దోషాన్నిమూటగట్టుకో వలసి వస్తుందని గ్రహించాలి. అలా దోషానికి అవకాశం ఇవ్వకుండా జరిగిన పూజకే ఫలితం ఉంటుందనే విషయాన్ని గమనించాలి.

More Bhakti Articles