ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆదిదేవుడు

ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆదిదేవుడు
మహాశివుడు స్వయంభువుగా ఆవిర్భవించిన క్షేత్రాలు అత్యంత విశిష్టమైనవిగా చెప్పబడుతున్నాయి. దేవతల కోరిక మేరకు ... మహర్షుల అభ్యర్థన మేరకు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించిన శివుడు, తన భక్తులతో నిత్యపూజలు అందుకుంటున్నాడు. అలా ఆయన కొలువుదీరిన మహిమాన్వితమైన క్షేత్రాల్లో ఒకటిగా కర్ణాటక ప్రాంతానికి చెందిన 'ఎల్లూరు' కనిపిస్తుంది.

ఈ ప్రదేశంలో అడుగుపెట్టిన వాళ్లకి ప్రాచీనకాలం నాటి ఆలయం కనిపిస్తుంది. కేరళ శైలిలో నిర్మించబడిన ఈ ఆలయంలో సదాశివుడు దర్శనమిస్తూ 'విశ్వనాథుడు' పేరుతో పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు. ఆ తరువాత కాలంలో ఇక్కడ గణపతిని ... అన్నపూర్ణమ్మ తల్లిని ప్రతిష్ఠించినట్టు చరిత్ర చెబుతోంది. ఇక్కడి విశ్వనాథుడు చల్లని మనసున్నవాడని చెబుతుంటారు. అంకిత భావంతో ఆరాధించి అడగాలేగాని వరాల జల్లును కురిపిస్తాడని అంటారు.

ఎలాంటి అనారోగ్యాల బారినుంచైనా వెంటనే బయటపడేయడం ఇక్కడి స్వామివారి ప్రత్యేకతగా చెబుతారు. ఆ స్వామి కృపాకటాక్షాలతో ఆపదల నుంచి ... అనారోగ్యాల నుంచి బయటపడిన వాళ్లు ఇక్కడ ఎందరో కనిపిస్తారు. వాళ్లంతా కూడా కుటుంబ సమేతంగా వచ్చి మొక్కుబడులు చెల్లిస్తూ వుంటారు. ఇక్కడ 'తులాభారం' తూగి ఆ బరువుకి తగిన వాటిని స్వామికి సమర్పించడం ఆనవాయతీగా వస్తోంది. విశేషమైన పర్వదినాల్లో స్వామి వారిని దర్శించి ఆయన అనుగ్రహాన్ని పొందే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది.

More Bhakti Articles