శ్రీవారి భక్తురాలిని అడ్డుకోవడం సాధ్యమా ?

శ్రీవారి భక్తురాలిని అడ్డుకోవడం సాధ్యమా ?
మహాభక్తురాలైన తరిగొండ వెంగమాంబ పట్ల కొందరు అసూయ ద్వేషాలను పెంచుకుంటారు. అసమానమైన తన భక్తి శ్రద్ధలతో తమకన్నా ఎక్కువగా ఆమె గౌరవించబడటాన్ని వాళ్లు తట్టుకోలేకపోతారు. ఆమెపై నిందలు మోపి అక్కడ ఆమెకి స్థానం లేకుండా చేస్తారు. దాంతో ఇక శ్రీవారికి తులసి మాలలు సమర్పించడం కుదరదని ఆమె కన్నీళ్లు పెట్టుకుంటుంది. అదే సమయంలో శ్రీవారు ప్రత్యక్షమై ఇకపై ఆమెను 'తుంబుర తీర్థం'సమీపంలో గల గుహలో ఉండవలసిందిగా చెబుతాడు.

దాంతో స్వామివారిని ధ్యానిస్తూ ఆమె అక్కడే ఉండసాగింది. ఈ నేపథ్యంలో ప్రతి ఉదయం శ్రీవారి గర్భాలయం తలుపులు తీయగానే, రాత్రి పూజించిన పూలన్నీ ఒక పక్కన పడి వుండటం ... ఎవరో కొత్తగా పూజించిన ఆనవాళ్లు కనిపించసాగాయి. ఈ విషయాన్ని గురించి అర్చకులకి ... మహంతులకి మధ్య చర్చ జరుగుతుంది. వేసిన తలుపులు వేసినట్టుగా వుండగా రాత్రివేళ స్వామివారిని ఎవరు .. ఎలా పూజిస్తున్నారో తెలుసుకోవాలని మహంతు నిర్ణయించుకుంటాడు.

బంగారు వాకిలి తలుపులు మూయడానికి ముందే లోపలికి ప్రవేశించి రహస్యంగా గమనించడం మొదలుపెడతాడు. ఓ రాత్రివేళ స్వామివారి ఎదురుగా బిలం ఏర్పడగా, దాంట్లో నుంచి ఓ దివ్యమైన తేజస్సు పైకి వస్తుంది. ఆ తేజస్సు క్రమంగా వెంగమాంబగా మారడం ... ఆమె చేతిలో తులసి మాలలు ... పూజా ద్రవ్యాలు వుండటం మహంతు చూస్తాడు. స్వామివారికి వెంగమాంబ తులసి మాలలు సమర్పించడం చూస్తూ స్పృహ కోల్పోతాడు.

మరునాడు ఉదయం ఆయన ద్వారా విషయం తెలుసుకున్న వాళ్లందరూ ఆశ్చర్యపోతారు. వెంగమాంబ పై లేనిపోని నిందలు వేసి ఆమెను దూరం చేసుకున్నందుకు బాధపడతారు. అసమానమైన ఆమె భక్తిని అందరూ కొనియాడతారు. ఈ సంఘటనతో వెంగమాంబ అసాధారణమైన భక్తి ... ఆమె పట్ల భగవంతుడి అనుగ్రహం గురించి మరోసారి అందరికీ అనుభవంలోకి వస్తుంది.

More Bhakti Articles