పరమాత్ముడు ప్రత్యక్షమైన ప్రదేశం

పరమాత్ముడు ప్రత్యక్షమైన ప్రదేశం
భగవంతుడు తన భక్తులను కాపాడటం కోసమే కాదు, వారి ముచ్చట తీర్చడం కోసం కూడా వివిధరూపాల్లో దర్శనమిస్తూ వుంటాడు. అలా ఓ భక్తుడి ముచ్చటను తీర్చడం కోసం సాక్షాత్తు మూలమూర్తి తన రూపాన్ని మార్చుకున్న మహిమాన్వితమైన సంఘటన మనకి చెన్నైలోని 'ట్రిప్లికేన్' లో దర్శనమిస్తుంది. పూర్వం ఈ క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారు తన భక్తులకు నయనమనోహరంగా దర్శనమిస్తూ ఉండేవాడట.

అప్పట్లో ఆ ప్రాంతాన్ని పాలిస్తోన్న రాజు, ఇక్కడి స్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తుండేవాడు. అనునిత్యం మానసికంగా ఆయనని ఆరాధిస్తుండేవాడు. అలాంటి స్వామిని దర్శించినప్పుడు, ఆయనని కురుక్షేత్ర యుద్ధ సమయంలో శ్రీ కృష్ణుడిగా చూడాలని వుందని ఆ రాజుగారు కోరాడు. మరుక్షణమే మూలమూర్తిగా వున్న శ్రీవారి రూపం కాస్తా శ్రీ కృష్ణుడిగా మారిపోయిందట. దాంతో ఇక్కడి కృష్ణుడిని 'పార్థసారథి' పేరుతో భక్తులు కొలుస్తుంటారు. సారథికి మీసాలు ఉండాలనే ఆనాటి నియమం కారణంగానే ఇక్కడి కృష్ణుడికి మీసాలు కనిపిస్తూ వుంటాయి. అలాగే ఓ సారథిగా ఆయన చేతిలో శంఖం కనిపిస్తూ వుంటుంది.

ఇక ఇక్కడ శ్రీకృష్ణుడి దివ్య మంగళరూపం సున్నితంగా ... సుమనోహరంగా కాకుండా, ముఖంపై అక్కడక్కడ కాస్త దెబ్బతిన్నట్టుగా గుర్తులు కనిపిస్తుంటాయి. ఈ విగ్రహం ఆవిర్భవించడమే అలా ఆవిర్భవించిందని చెబుతారు. మహాభారత యుద్ధంలో అర్జునుడిపై వర్షంలా కురుస్తోన్న బాణాలు కొన్ని సారథిగా వున్న శ్రీ కృష్ణుడిని కూడా గాయపరిచాయి. అలా గాయపడిన కృష్ణుడు అలాగే ఇక్కడ అవతరించడం వలన, ఈ విగ్రహంపై గల గుర్తులను బాణాలు చేసిన గాయాలుగా చెబుతుంటారు.

ఆయుధాలు చేపట్టనని చెప్పిన ప్రకారం శ్రీ కృష్ణుడు ఇక్కడ శంఖాన్ని మాత్రమే ధరించి కనిపించడం ... మీసాలను కలిగి వుండటం ... బాణాలు చేసిన గాయాల గుర్తులతో సహా ఆవిర్భవించడం విశేషంగా చెబుతారు. మహిమాన్వితమైన ఇక్కడి స్వామివారిని దర్శించడం వలన విజయాలు ... సంపదలు కలుగుతాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.

More Bhakti Articles