దంపతులు దర్శించవలసిన క్షేత్రం

దంపతులు దర్శించవలసిన క్షేత్రం
భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలే కాదు ... కొన్ని సందర్భాల్లో పంతాలు - పట్టింపులు కూడా కనిపిస్తుంటాయి. ఒక్కోసారి సమస్య పెద్దదై ఇక కలిసుండటం కష్టమనే నిర్ణయానికి వచ్చేంత వరకూ వెళుతుంది. ఇలాంటి సందర్భాల్లో ఇద్దరినీ కలిసి ఏదైనా క్షేత్రానికి వెళ్లి రమ్మని పెద్దలు సలహా ఇస్తుంటారు. ఆ విధంగా చేస్తే చిరాకులు తొలగిపోతాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు.

అలాంటి క్షేత్రంగా మనకి 'అన్నవరప్పాడు' కనిపిస్తుంది. ఈ క్షేత్రంలోని 'లక్ష్మీవేంకటేశ్వరస్వామి'ని దర్శించుకుంటే భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తకుండా వాళ్లు అన్యోన్యంగా ఉంటారని స్థానికులు చెబుతుంటారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ క్షేత్రంలో ఇరు దేవేరులతో స్వామివారు దర్శనమిస్తూ వుంటారు. పూర్వం కశ్యప మహర్షి శ్రీనివాసుడి అనుగ్రహాన్ని కోరుతూ ఈ ప్రదేశంలో తపస్సు చేశాడనీ, ఆయన అభ్యర్ధన మేరకు స్వామి ఇక్కడ కొలువుదీరాడని స్థలపురాణం చెబుతోంది.

కాలక్రమంలో ఓ భక్తుడికి స్వామివారు కలలో కనిపించి ఆదేశించిన మేరకు ఇక్కడ ఆలయం నిర్మించబడింది. ఇక్కడి 'వరాహ పుష్కరిణి' ఎంతో విశిష్టమైనదని చెబుతుంటారు. ఈ క్షేత్రంలో ప్రతి యేటా అత్యధిక సంఖ్యలో వివాహాలు జరుగుతుంటాయి. ఇక్కడ వివాహం చేసుకున్న జంటలు ఆనందంగా ... హాయిగా వుంటారనే బలమైన నమ్మకం కనిపిస్తుంది. తమని చల్లగా చూస్తోన్న స్వామివారికి కృతజ్ఞతలు తెలిపేందుకు వాళ్లు తరచూ వచ్చి వెళుతుంటారు.

ఇక వైవాహిక జీవితం గొడవలతో సాగుతున్నప్పుడు, స్వామి దర్శనం చేసుకుని సఖ్యతను సాధించిన వాళ్లు కూడా ఆయన్ని మరిచిపోకుండా ఈ క్షేత్రాన్ని దర్శిస్తూ వుంటారు. తాము ఆశించిన ఫలితాన్ని అందించిన స్వామికి కానుకలను ... మొక్కుబడులను సంతోషంగా సమర్పిస్తూ వుంటారు. వరాహస్వామి క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తోన్న ఈ క్షేత్రంలో గణపతి ... కుమారస్వామి ... ఆంజనేయస్వామి మందిరాలు కనిపిస్తాయి. ప్రధాన దైవమైన స్వామివారికి వివిధ పర్వదినాల్లో ప్రత్యేక పూజలు ... విశేష ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు.

More Bhakti Articles