తొలినాళ్లలో తిరుమల

తొలినాళ్లలో తిరుమల
తిరుమలను భూలోక వైకుంఠంగా పురాణాలు చెబుతున్నాయి. మహర్షుల అభ్యర్థన మేరకు శ్రీమహావిష్ణువు ... శ్రీనివాసుడుగా ఏడుకొండలపై ఆవిర్భవించాడు. ఈ నేపథ్యంలో ఇక్కడ అనుభవంలోకి వచ్చిన మహిమలు ఒకటి .. రెండు కాదు. ఈ కారణంగానే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి రాసాగారు. ఎలాంటి వసతి సౌకర్యాలు ... రక్షణ కంచెలు లేని ఆ రోజుల్లో, భక్తి విశ్వాసాలు మాత్రమే భక్తులను ఆనందనిలయం వరకూ తీసుకువెళ్లాయి.

ఇలాంటి పరిస్థితుల్లోనే టీటీడి (1933) ఏర్పడి ... నడకదారిని అభివృద్ధి పరిచింది. అలిపిరి నుంచి కొండపైకి రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయడం వలన భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భావించిన ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం అందుకు శ్రీకారం చుట్టింది. సర్వేలు చేపట్టి ప్రణాళిక ప్రకారం పనిని పూర్తిచేసి, 1944 ఏప్రిల్ 10వ తేదీ నుంచి రోడ్డు మార్గాన్ని ఉపయోగించడం ప్రారంభించింది. తొలినాళ్లలో టీటీడీ అలిపిరి నుంచి తిరుమలకు రెండు బస్సులను మాత్రమే నడుపుతూ వుండేది.

ఒక బస్సు అలిపిరి దగ్గర గల భక్తులను కొండపైకి తీసుకు వెళుతుంటే, మరో బస్సు కొండ పైనున్న వాళ్లని కిందికి చేర్చేది. అలా రోజుకి స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య 300 లోపు వుండేది. 1955 నాటికి భక్తుల సంఖ్య 600 వరకూ చేరుకోవడంతో టీటీడి మరో మూడు నాలుగు బస్సు సర్వీసులను ఏర్పాటు చేయడమే కాకుండా, రైల్వే స్టేషన్ దగ్గరలో 'శ్రీనివాస బస్టాండ్' ను నిర్మించింది. టీటీడి బస్సులు ఇక్కడి నుంచే కొండకు బయలుదేరుతూ ఉండటంతో భక్తుల కష్టాలు కొంతవరకూ గట్టెక్కాయి.

ఇక ఒకే దారిలో కొండపైకి రాకపోకలు పెరుగుతూ ఉండటంతో ఇబ్బందులు మొదలయ్యాయి. అందుకు పరిష్కారంగా మరో రోడ్డు మార్గాన్ని ఏర్పాటుచేయాలనే ఆలోచన ఆచరణకి నోచుకుని 1974లో ఫలించింది. అప్పటి నుంచి ప్రయాణీకులను కొండపైకి చేర్చే పనిలో ఏపీఎస్ ఆర్టీసి పాలుపంచుకుంది. ఇక 1980 నుంచి శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ రావడంతో, ఆర్టీసి కూడా అందుకు తగిన ఏర్పాట్లు చేస్తూ వస్తోంది. అలా స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య వందల్లో నుంచి వేలల్లోకి ... లక్షల్లోకి చేరుకుంది.

More Bhakti Articles