దుష్టశక్తులను తరిమేసే క్షేత్రం

దుష్టశక్తులను తరిమేసే క్షేత్రం
గురువు యొక్క అనుగ్రహముంటే దరుద్రులు ధనవంతులవుతారు. దురదృష్ట వంతులు అదృష్టవంతులవుతారు. అనారోగ్యంతో బాధలుపడుతున్న వాళ్లు వాటి నుంచి విముక్తిని పొంది ఆరోగ్యవంతులవుతుంటారు. ఈ కారణంగానే గురువు కొలువైన క్షేత్రాలను భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటూ వుంటారు. ఈ నేపథ్యంలో విశిష్టమైన గురు క్షేత్రంగా కర్ణాటక ప్రాంతానికి చెందిన 'గాణుగాపురం' దర్శనమిస్తుంది.

దత్త గురుపరంపరలో రెండో అవతారంగా చెప్పబడుతోన్న శ్రీ నృసింహ సరస్వతి ఈ క్షేత్రంలో దర్శనమిస్తూ వుంటాడు. శ్రీ గురుడుగా ప్రసిద్ధి చెందిన శ్రీ నృసింహసరస్వతి నడయాడిన పుణ్యస్థలి ఇది. భీమ - అమరజా అనే రెండు నదులు ఈ క్షేత్రంలో ఉత్తర దిక్కుగా ప్రవహిస్తూ వుంటాయి. ఈ పుణ్య నదుల సంగమ స్థానంలో స్నానమాచరించిన భక్తులు అక్కడికి సమీపంలో గల ఔదుంబర వృక్షానికి ప్రదక్షిణలు చేస్తుంటారు.

ఇక ఈ నదీతీరంలో నిర్మించబడిన ఆలయం ప్రాచీనతకు ప్రతీకగా కనిపిస్తూ వుంటుంది. ఆలయ ముఖద్వారంపై దత్తాత్రేయస్వామి ... శ్రీపాద శ్రీ వల్లభులు ... శ్రీ నృసింహసరస్వతి ప్రతిమలు మలచబడి వుంటాయి. గర్భాలయంలో శ్రీ నృసింహసరస్వతి స్వామి పాదుకలు దర్శనమిస్తూ వుంటాయి. భక్తులు ఈ పాదుకలను దర్శించుకుని వాటికే పూజలు చేయిస్తూ వుంటారు. గురువారాల్లో శ్రీ నృసింహ సరస్వతికి పల్లకీ సేవను నిర్వహిస్తూ వుంటారు.

ఈ క్షేత్రంలో శ్రీ నృసింహ సరస్వతి చూపిన మహిమలు అన్నీ ఇన్నీ కావు. వాటిని భక్తులు ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటూ వుంటారు. ఇక్కడి నదీ సంగమ స్థానంలో స్నానం చేసి ఔదుంబర వృక్షానికి ప్రదక్షిణలు చేయడం వలన ... స్వామివారిని దర్శించడం వలన అనారోగ్యాలు తొలగిపోతాయనీ, దుష్ట శక్తులు వదిలిపోతాయని భక్తులు అనుభవ పూర్వకంగా చెబుతుంటారు. ఇదే క్షేత్రంలో కొలువైన దత్తాత్రేయ స్వామికి ... కల్లేశ్వరుడికి ప్రత్యేక పూజాభిషేకాలు జరుపుతుంటారు.

More Bhakti Articles