వరాలు కురిపించే వేంకటేశ్వరుడు

వరాలు కురిపించే వేంకటేశ్వరుడు
దేవుడు ఒక్కడే అయినప్పటికీ తమ భావాలకి తగిన విధంగా అనేక రూపాల్లో ... అనేక నామాలతో భక్తులు ఆయనను కొలుస్తుంటారు. సాధారణంగా చాలామంది రాముడినీ ... రంగడిని ... గోపాలుడిని పూజిస్తూ వుంటారు. ఈ నేపథ్యంలో అనుకోకుండా ఏదైనా కష్టం కలగగానే ''స్వామీ నీ కొండకు వస్తాం'' అంటూ వేంకటేశ్వరుడికి మొక్కుకుంటూ వుంటారు. అలా అని రాముడిపై .. రంగడిపై వాళ్లకి నమ్మకం లేక కాదు, రాముడు ... రంగడు వేరనీ కాదు.

ఆపద సమయంలో అందరికీ ముందుగా వేంకటేశ్వరస్వామి పేరే గుర్తుకు వస్తుంది. అంతగా ఆ గోవిందుడు భక్తుల మనసును ప్రభావితం చేస్తుంటాడు. ఆపదలను తొలగించి అనుగ్రహిస్తుంటాడు. ఆ స్వామి కొలువైన విశిష్ట ఆలయాల్లో ఒకటి హైదరాబాద్ - రాజేంద్ర నగర్ లో దర్శనమిస్తుంది. స్వామివారు నెలకొన్న గుట్టను 'వెంకన్నగుట్ట' గా పిలుస్తుంటారు. భక్తులు మెట్ల మార్గంలో సన్నిధానానికి చేరుకుంటూ వుంటారు.

ప్రధానదైవమైన వేంకటేశ్వరుడు ... క్షేత్రపాలకుడైన హనుమంతుడు స్వయంభువులు కావడం ఇక్కడి విశేషం. ఇక వేంకటేశ్వరస్వామి ప్రతిమను ప్రతిష్ఠ చేస్తుండగా, ఓ బండరాయి దొర్లుకుంటూ వచ్చి స్వామివారి పక్కనే ఆగిందట. ఆ శిలను అమ్మవారిగా భావించి పూజాభిషేకాలు నిర్వహిస్తూ వుండటం మరో విశేషంగా చెప్పుకుంటూ వుంటారు. ఇక్కడి స్వామిని భక్తులు వెన్నలాంటి మనసున్న వేంకటేశ్వరుడిగా కొనియాడుతుంటారు. స్వామి ఆశీస్సులు తీసుకుని ఏ పనిని ప్రారంభించినా అది ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుందని విశ్వసిస్తూ వుంటారు.

ఆ తరువాత కాలంలో ఈ ప్రాంగణంలో పార్వతీ సమేత చంద్రమౌళీశ్వరస్వామి ఆలయం .. సీతారాముల ఆలయం నిర్మించబడింది. లక్ష్మీ శ్రీనివాసులు .. పార్వతీ పరమేశ్వరులు .. సీతారాములు కొలువుదీరిన కారణంగా ఈ క్షేత్రం మరింత మహిమాన్వితమైనదిగా చెప్పబడుతోంది. పర్వదినాల్లోనే కాకుండా సాధారణ రోజుల్లో సైతం భక్తులు ఎక్కువగానే వస్తుంటారు .. ఆధ్యాత్మిక పరిమళాలను ఆస్వాదిస్తూ వుంటారు.

More Bhakti Articles