మథురానగరాన్ని రక్షిస్తోన్న మహాశివుడు

మథురానగరాన్ని రక్షిస్తోన్న మహాశివుడు
మథుర పేరు వినగానే మనోహరమైన శ్రీకృష్ణుడి రూపం కళ్ల ముందు కదలాడుతుంది. ఆయన లీలా విశేషాలు ... విన్యాసాల గురించి తెలుసుకున్నవారికి ఆ దృశ్యాలు గుర్తుకొస్తాయి. మథురలో అడుగుపెట్టిన వాళ్లకి మరికొద్ది సేపట్లో శ్రీకృష్ణుడిని చూస్తామనే అనుభూతి కలుగుతుంది. యమునా నదితో పాటు అక్కడి వాతావరణం ... నిర్మాణాలు అంతగా మనసును ప్రభావితం చేస్తుంటాయి.

మథుర ... ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా కృష్ణుడి సంబంధిత విశేషాలతో విలసిల్లుతూ వుంటాయి. ఈ కారణంగా మథురలో మరో దైవం కనిపించదేమోనని చాలామంది అనుకుంటూ వుంటారు. అలాంటి వాళ్లు ఈ క్షేత్రంలో అడుగుపెడితే ఆశ్చర్యపోక తప్పదు. శ్రీ కృష్ణుడి పాద ధూళిచే పవిత్రమైన ఈ పుణ్యభూమిలో మహాశివుడు సైతం కొలువై పూజలు అందుకుంటూ ఉంటాడు.

కేవలం ఒక చోటున మాత్రమే శివుడు నెలకొని వుంటే అది పెద్ద విశేషమయ్యేది కాదు. కానీ మథురానగరానికి నాలుగు దిక్కులా శివుడు కొలువుదీరి కనిపిస్తాడు. 'డిపలేశ్వరుడు' పేరుతో తూర్పున ... 'భూతేశ్వరుడు' పేరుతో పడమరన ... 'గోకర్ణేశ్వరుడు' పేరుతో ఉత్తరాన ... 'రంగేశ్వరుడు' పేరుతో దక్షిణాన శివుడు పూజాభిషేకాలు అందుకుంటూ వుంటాడు. శ్రీ కృష్ణుడి జన్మస్థలమైన ఈ మథురానగరాన్ని నాలుగు దిక్కులా ఆవిర్భవించిన మహాశివుడే రక్షిస్తూ ఉంటాడని చెబుతారు.

ఇక సదాశివుడు మాత్రమే కాదు ... శక్తిస్వరూపిణి అయిన అమ్మవారు నెలకొన్న శక్తి పీఠంగా కూడా ఈ క్షేత్రం అలరారుతోంది. యాభైఒక్క శక్తి పీఠాల జాబితాలో మహిమాన్వితమైన ఈ శక్తిపీఠం మనకి కనిపిస్తుంది. సతీదేవి 'కురులు' ఈ ప్రదేశంలో పడ్డాయని అంటారు. అందువలన అమ్మవారు చాముండీ పేరుతో ఇక్కడ కొలువై ఈ క్షేత్రాన్ని దర్శించిన భక్తులను అనుగ్రహిస్తూ వుంటుంది.

More Bhakti Articles