శ్రీ దత్తానుగ్రహం లభించే క్షేత్రం

శ్రీ దత్తానుగ్రహం లభించే క్షేత్రం
భారతీయుల ఆధ్యాత్మిక ప్రపంచాన్ని విస్తృతమైన స్థాయిలో ప్రభావితం చేసిన అవతారం శ్రీ దత్తావతారం. ఇటు దేవతలకు ... అటు మానవాళికి జ్ఞాన బోధను చేసి, అడుగడుగునా ఆయన ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లాడు. దర్శనమాత్రం చేతనే జ్ఞానామృతాన్ని అందించే దత్తాత్రేయుడు అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించి పూజాభిషేకాలు అందుకుంటున్నాడు.

అలా ఆయన కొలువుదీరిన క్షేత్రంగా మెదక్ జిల్లా 'బర్దీపూర్' దర్శనమిస్తుంది. ఇక్కడి దత్తగిరి ఆశ్రమంలో స్వామి భక్తులను అనుగ్రహిస్తూ వుంటాడు. ఈ ఆశ్రమంలో దత్తాత్రేయుడు ... ఆయన ఎదురుగా దత్తగిరి మహారాజ్ సమాధి దర్శమిస్తుంటాయి. గర్భాలయంలో దత్తత్రేయ స్వామి పాలరాతి మూర్తి మూడు శిరస్సులతో ... దివ్యమైన తేజస్సుతో కనిపిస్తూ వుంటుంది.

దత్త దర్శనం వలన గ్రహ సంబంధమైన దోషాలు ... దుష్ట ప్రయోగాల వలన కలిగే బాధలు పటాపంచలవుతాయి. అందువలన దత్తాత్రేయుడు నెలకొన్న ఈ క్షేత్రాన్ని భక్తులు దర్శిస్తూ వుంటారు. దత్తాత్రేయస్వామికి తల్లిదండ్రులయ్యే భాగ్యానికి నోచుకున్న అత్రి మహర్షి ... అనసూయాదేవి మందిరాలు కూడా ఈ ప్రాంగణంలో కనిపిస్తాయి. ఇక నాగేంద్ర స్వామికి ప్రత్యేక ఆలయం ఇక్కడ నిర్మించడం జరిగింది.

ఆ పక్కనే ద్వాదశ జ్యోతిర్లింగాల పేరుతో పన్నెండు శివలింగాలు దర్శనమిస్తాయి. ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులకు శివదత్తుడి అనుగ్రహం ... నాగేంద్రస్వామి కరుణ ... అత్రి మహర్షి - అనసూయాదేవి ఆశీస్సులు లభిస్తాయి. గురువారాల్లోను ... గురు సంబంధిత పర్వదినాల్లోను ఈ క్షేత్రానికి చేరుకున్న భక్తులు స్వామివారిని పూజిస్తూ పునీతులవుతుంటారు.

More Bhakti Articles