రామాయణంతో ముడిపడిన క్షేత్రం

రామాయణంతో ముడిపడిన క్షేత్రం
సీతారామలక్ష్మణులు వనవాసానికి బయలుదేరి వెళ్లినది మొదలు ... తిరిగి వచ్చేంత వరకూ జరిగిన సంఘటనలు అన్నీ ఇన్నీ కావు. వీటిలో శూర్పణఖ ముక్కు - చెవులను లక్ష్మణుడు కోసిన సంఘటన అత్యంత ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఎందుకంటే సీతాదేవిని రావణుడు అపహరించడానికి దారితీసిన సంఘట ఇదే. తన సోదరి అయిన శూర్పణఖను అవమానించినందుకు ప్రతీకగా సీతమ్మవారిని రావణుడు అపహరించుకు వెళ్లాడు.

సీతమ్మవారిని అన్వేషించేందుకు రామలక్ష్మణులు బయలుదేరడం ... వారికి హనుమంతుడు పరిచయం కావడం ... వాలి వధ ... సుగ్రీవుడితో మైత్రి ... వారధి నిర్మాణం ... రావణ సంహారం వంటివి జరిగాయి. ఇంతటి కథకు కారణమైన శూర్పణఖ ముక్కు - చెవులు కోసిన ప్రదేశంగా 'మడనూరు' చెప్పబడుతోంది. ప్రకాశం జిల్లాకి చెందిన ఈ ప్రదేశంలో లక్ష్మణుడు ... శూర్పణఖ ముక్కు - చెవులు కోయగా ఆమె రక్తం మడుగు కట్టిందట.

ఈ కారణంగానే ఈ ఊరుకి 'మడుగూరు' అనే పేరు వచ్చిందనీ, కాలక్రమంలో అది ' మడనూరు' గా మార్పుకు లోనైందని అంటారు. శ్రీరాముడు ఈ ప్రదేశంలో సైకత లింగాన్ని ప్రతిష్ఠిచాడు. ఈ కారణంగానే ఇక్కడి శివుడు 'రామలింగేశ్వరుడు' గా పిలవబడుతున్నాడు. ఇంతటి చరిత్ర కలిగినది గనుకనే ఇక్కడి శివాలయాన్ని అభివృద్ధి పరచడానికి శ్రీ కృష్ణదేవరాయలు సైతం కృషి చేశాడని స్థలపురాణం చెబుతోంది. ఇక ఈ క్షేత్రంలోని కోనేరు సాక్షాత్తు శివుడి సృష్టనీ, ఇందులో స్నానం చేయడం వలన విశేష పుణ్యఫలాలు లభిస్తాయని చెబుతారు.

పరమశివుడు రామలింగేశ్వరుడు పేరుతో అలరారుతోన్న ఈ క్షేత్రంలో, అమ్మవారు పర్వతవర్ధిని పేరుతో పూజలు అందుకుంటూ వుంటుంది. ఇక రాముడు ప్రతిష్ఠించాడు గనుక హనుమంతుడు ... శివయ్య కొలువుదీరాడు గనుక వీరభద్రుడు దర్శనమిస్తూ వుండటం ఇక్కడ విశేషం. ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన సకల శుభాలు చేకూరతాయని భక్తులు విశ్వసిస్తూ వుంటారు.

More Bhakti Articles