ఊరును నిద్రలేపిన నంది

ఊరును నిద్రలేపిన నంది
వివిధ శైవ క్షేత్రాల్లో శివుడి గర్భాలయానికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై కనిపిస్తుంటాడు. శివ భక్తులలో నంది అగ్రగణ్యుడు ... శివుడిని చూడకుండగా ఆయన క్షణం సేపు కూడా ఉండలేడు. అందువల్లనే శివుడికి ... నందికి మధ్య అడ్డుగా నిలబడకూడదని అంటారు. అలాంటి నంది ... శివుడికి ఎదురుగా కాకుండా, మరోవైపు తిరిగి వుంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది.

సాధారణంగా శివుడికి ఎదురుగా కాకుండా నంది మరోవైపు తిరిగి వున్న చోట ఏదో ఒక ప్రత్యేకత వుంటుంది ... నంది ఆ విధంగా వుండటం వెనుక ఏదో ఒక మహిమాన్వితమైన సంఘటన చోటుచేసుకుని కనిపిస్తుంది. అలాంటి సంఘటన మనకు మెదక్ జిల్లా 'మర్పడక' లో కనిపిస్తుంది. కాకతీయుల కాలంలో నిర్మించబడిన ఈ క్షేత్రంలో సంతాన మల్లికార్జునస్వామి భక్తులను అనుగ్రహిస్తూ వుంటాడు.

ఇక్కడ నంది స్వామివారి వైపు కాకుండా, గ్రామం వైపు చూస్తూ కనిపిస్తాడు. అయితే నందిని ఇలా ప్రతిష్ఠించడం జరగలేదు. ఆ తరువాత కాలంలో నంది ఊరు వైపు తిరిగాడని స్థానికులు చెబుతుంటారు. చాలా కాలం క్రిందట ఓ రాత్రివేళ కొందరు దుండగులు ఆలయంపై దాడి చేయడానికి ప్రయత్నించగా, గ్రామ ప్రజలను నిద్రలేపడం కోసం నంది పెద్దగా అరిచాడట. ఆ అరుపుకి ఊరంతా ఉలిక్కిపడి నిద్రలేచింది.

ఆ అరుపు ఎక్కడి నుంచి వచ్చి ఉంటుందా అని ఆలోచన చేస్తూ, కొందరు గుడివైపు రాగా పారిపోతున్న దుండగులు కనిపించారు. మరి ఆబోతు అరుపు ఎక్కడి నుంచి వచ్చి ఉంటుందని అనుకుంటూ వాళ్లు యథాలాపంగా చూడగా, అంతకు ముందురోజు వరకూ శివుడి వైపు తిరిగి కనిపించిన నంది, ఊరు వైపు తిరిగి కనిపించాడు. దాంతో వారికి విషయం అర్థమైంది. ఆ రోజు నుంచి ఇక్కడి ప్రజలు శివుడితో సమానంగా నందీశ్వరుడిని పూజిస్తూ వుంటారు. నందీశ్వరుడు తమ ఊరును ఓ కంట కనిపెడుతూ ... కాపాడుతూ ఉంటాడని బలంగా విశ్వసిస్తుంటారు.

More Bhakti Articles